తెరాసకు 100కు పైగా సీట్లు పక్కా: కేసీఆర్‌

సికింద్రాబాద్‌ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగసభలో సిఎం కేసీఆర్‌ మరోసారి తెరాసకు 100కు పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని పునరుద్ఘాటించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి నేటి వరకు తాను రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో పర్యటించి, సభలు, సమావేశాలు నిర్వహించి, లక్షలాది ప్రజల అభిమతాన్ని తెలుసుకొన్నాక తెరాసకు 100కు పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. అలాగే హైదరాబాద్‌ పరిధిలో కూడా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నాటి ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయని చెప్పారు. దీనిలో ఎటువంటి సందేహమూ లేదని నూటికి నూరు శాతం తన సర్వే నిజమని తేలుతుందని సిఎం కేసీఆర్‌ చెప్పారు.

అయితే తనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకటి రెండు రోజులలో సర్వే ఫలితాలంటూ కొందరు వెకిలి ప్రయత్నాలు చేస్తారని, రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేసి తప్పుదారి పట్టించడానికే ఆ ప్రయత్నాలని అందరూ గుర్తించాలని కేసీఆర్ కోరారు. వాటన్నిటినీ పట్టించుకోకుండా తెరాసను భారీ మెజార్టీతో గెలిపించి దీవించాలని కెసిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.