10.jpg)
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగసభలో సిఎం కేసీఆర్ తెరాస ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఆయన ప్రకటించిన హామీలే దానిలో ఉన్నాయి. కొత్తగా చెప్పుకోవలసిన వాటిలో
1. తెలంగాణ రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ వేతనం చెల్లిస్తాం.
2. వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం ఆయా కుల సంఘాలు చేసిన విజ్ఞప్తులను సానుభూతితో పరిశీలిస్తుంది.
3. రాష్ట్రంలో ప్రజలందరికీ ప్రధానమైన అన్ని రకాల ఆరోగ్యపరీక్షలు జరిపించి, ప్రతీ వ్యక్తి పేరిట ‘హెల్త్ ప్రొఫైల్ రికార్డు’ రూపొందిస్తాం.
4. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు.
5. పోడు భూములకు సంబందించి వివాదాలను పరిష్కరించి ఆ భూములను సాగు చేసుకొంటున్న గిరిజనులు తదితరులకు ఆ భూములపై యాజమాన్యపు హక్కులు కల్పిస్తాం. వారికి కూడా ఇతర రైతులకు ఇస్తున్న అన్ని ప్రయోజనాలను వర్తింపజేస్తాం.
6. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానట్లయితే రాష్ట్ర ప్రభుత్వమే దానిని నిర్మిస్తుంది.
7. సింగరేణి భూములలో ఇళ్ళు కట్టుకున్నవారికి పట్టాలు మంజూరు.
ఇవికాక గత రెండున్నర నెలలుగా ఎన్నికల ప్రచార సభలలో చెపుతున్న హామీలన్నీ తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయి. ఆ వివరాలు:
1. నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3,016 భృతి.
2. వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016 వరకు పెంచడం జరుగుతుంది.
3. అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచడం జరుగుతుంది.
4. వృద్దాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించడం జరుగుతుంది.
5. బీడి కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్ ను 2018 వరకు పొడిగించడం జరుగుతుంది.
6. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం యధాతధంగా కొనసాగిస్తూనే, సొంత స్థలం ఉన్నఅర్హులైన పేదలకు ఇళ్ళ నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆర్ధిక సహాయం (తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు) అందిస్తాం.
7. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం జరుగుతుంది.
8. నిరుద్యోగులకు వయో పరిమితిని మూడేళ్లు పెంచుతాం.
9. రైతుబంధు పధకంలో అందిస్తున్న రూ. 8,000 నుంచి 10,000కు పెంచుతాం.
10. రైతులకు లక్ష రూపాయల వరకున్న పంట రుణాలు మాఫీ చేస్తాం.
11. అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
12. రెడ్డి, వైశ్య కార్పొరేషన్లతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతరవర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు. అలాగే వివిధ సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చే విజ్ఞప్తులను సానుభూతితో పరిశీలిస్తుంది.
13. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.
14. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టిఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
15. చట్టసభల్లో బిసిలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది.
16. ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తాం.
17. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకెపి ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకెపి ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది.
ఇవికాక ఇప్పటి వరకు అమలవుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ పధకాలు యధాతధంగా కొనసాగనున్నాయి.