మల్లారెడ్డిపై కేటీఆర్ జోకులు

ఎంపీలందు మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి వేరయా అని అందరికి తెలుసు. ఆయన మాట్లాడే మాట, ఆయన హావభావాలు, కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి ఆయన వేసే చిందులు అన్నింటా కూడా ఆయన మార్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది. తన కాలేజీ ఫంక్షన్ లో అయితే విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఇచ్చే స్పీచ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. కాలేజ్ లో అయినా జనాల్లో అయినా ఆయన చాలా డిఫరెంట్ గా మాట్లాడతారు. అలా మాట్లాడటంపై కేటీఆర్ జోకులు వేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ మల్లారెడ్డి గురించి ఏమన్నారో వింటే అది నిజమే అనిపిస్తుంది.

రంగారెడ్డి జిల్లా మల్లారెడ్డి కాలేజ్ లో జరిగిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో  మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అంతకుముందు మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాలేజ్ ని పచ్చగ చేస్తం.. ఊరిని పచ్చగ చేస్తం.. కేసీఆర్ లాంటి వాళ్లు తెలంగాణకు సిఎంగా ఉంటే తెలంగాణ మొత్తం పచ్చగ చేస్తం అని ఆవేశంగా మాట్లాడారు. విద్యార్థులు చెట్లు నాటతారా లేదా అని తనదైన స్టైల్లో అడిగారు. ఆయన మాట్లాడే విధానం, ఆయన వాడుక భాష స్టేజ్ మీద ఉన్న వాళ్లందరిని నవ్వించింది.

తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి తర్వాత మాట్లాడితే బిర్యానీ తర్వాత పప్పన్నం తిన్నట్లుందని అన్నారు. అందుకే దర్శకుడు బోయపాటి శ్రీను ఈయనకు సినిమాలో అవకాశం ఇవ్వాలని అడిగారు. హీరోగా ఓకేనా అంటూ విద్యార్థులను ప్రశ్నించారు. వాళ్లు కూడా హీరోగానే ఓకే అనడం జరిగింది.