ముఖ్యమంత్రి కావాలనుకొంటే తప్పేమిటి? కోమటిరెడ్డి

సీనియర్ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో క్షణం తీరికలేకుండా తిరుగుతున్నందున మీడియాలో పెద్దగా కనబడటంలేదు. నల్గొండ నుంచి పోటీ చేస్తున్న ఆయనను ఈసారి ఎలాగైనా ఓడించి నల్గొండ కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టాలని తెరాస చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈసారి జిల్లాలో 12 స్థానాలను మేమే గెలుచుకోబోతున్నామని కొన్ని రోజుల క్రితం కేసీఆర్‌ నల్గొండ బహిరంగసభలో ప్రకటించి వెళ్లారు. కానీ నల్గొండలో కనీసం 10 స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని చూపిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరాసకు సవాలు విసిరారు. కనుక జిల్లాలో కాంగ్రెస్‌-తెరాసల మద్య ఈసారి గట్టి పోటీ నెలకొని ఉంది. ఈ కారణంగా ఆయన జిల్లా దాటి బయటకు రాలేని పరిస్థితి కనబడుతోంది. 

ఇటీవల ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతున్నప్పుడు కారులోనే ఆయనను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. “రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందా? వస్తే మీరు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా? మీరే ముఖ్యమంత్రి కాబోతున్నారని మీ అనుచరులు ప్రచారం చేస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏమిటి?” అనే విలేఖరి ప్రశ్నకు, “రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి రాబోతోందని అందరూ భావిస్తునందునే ఈ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలలో నేను కూడా ఒకడిని. కనుక ముఖ్యమంత్రి పదవి ఆశిస్తే తప్పు లేదు. పార్టీలో నన్ను అభిమానించేవారు నేను ముఖ్యమంత్రిని కావాలనుకోరుకొంటే తప్పు లేదు. అటువంటి అవకాశం రావాలని నేను కూడా కోరుకొంటున్నాను. ఎన్నికల తరువాత దీనిపై మా అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం. అది మా అందరికీ శిరోధార్యం” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.