తెరాస అలా చేయడం సరికాదు: బిజెపి

కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. గురువారం వనపర్తిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రానికి ఈ నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.1,15,000 కోట్లు అందజేసింది. కానీ తెరాస ప్రభుత్వం దానితో రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయెలేకపోగా అప్పులపాలు చేసింది. కేసీఆర్‌ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా ఏవిధంగా ఇవ్వగలమని కేసీఆర్‌ అనుకొంటున్నారు? ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలనుకొంటే వేరెవరి కోటాను తగ్గిస్తారు? తగ్గిస్తే వారు ఊరుకొంటారా? ఈ సంగతి కేసీఆర్‌ తెలియకనే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చారనుకోవడం లేదు. ఈ పేరుతో వారిని ఆకట్టుకొని వారి ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

అయితే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మేము మతప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం. మేము మొదటి నుంచే ఈ విషయం స్పష్టంగా చెపుతున్నాము. కానీ కేసీఆర్‌ ముస్లింలకు రిజర్వేషన్ల శాతం పెంచాలని శాసనసభలో తీర్మానం చేసి డిల్లీకి పంపించేసి చేతులు దులుపుకొని ఇప్పుడు ఎన్నికల సమయంలో మమ్మల్ని నిందిస్తూ బిజెపిని ముస్లిం వ్యతిరేకిగా ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈవిధంగా చేయడం సరికాదు.

మా ప్రభుత్వం దేశంలో అన్ని ప్రాంతాలను, మతాలను, కులాలు, వర్గాలకు చెందిన ప్రజలను సమానంగా చూస్తుంది. మాకు ఎవరిపట్ల ద్వేషం లేదు. అందరూ మాకు సమానమే. కేసీఆర్‌ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రజలను మాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ది పొందాలని చూస్తున్నారు.

ఈ నాలుగేళ్ళలో కేసీఆర్‌ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు. కానీ ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపధంలో నడిపించి చూపారు. కనుక తెలంగాణ రాష్ట్రం కూడా వేగంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలి,” అని అన్నారు. 

ప్రజాకూటమి గురించి మాట్లాడుతూ, “అదొక అపవిత్రకూటమి. అది ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పడినది కాదు. అధికార యావతో ఏర్పడినది మాత్రమే. కేంద్రంలో మోడీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో అది ఏర్పడింది. కానీ ఎన్ని పార్టీలు కలిసినా మోడీ ప్రభంజనం ముందు అవన్నీ కొట్టుకుపోవలసిందే,” అని అన్నారు.