
ఈరోజు భూపాలపల్లిలో ప్రజాకూటమి నిర్వహించిన ప్రజాకూటమి సభలో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగాలలో తెరాస ప్రభుత్వాన్ని, సిఎం కేసీఆర్‌ను ఎండగట్టారు. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చి గెలిచిన తెరాస, ఆ తరువాత వారికిచ్చిన హామీలను గాలికొదిలేసిందని ఆరోపించారు.
వారసత్వ నియామకాలు, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం, వివిద కారణాలతో తొలగించిన కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవడం, కార్మికులకు వారి కుటుంబాలకు అవసరమైతే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్య చికిత్సలు చేయించడం, కార్మికుల పిల్లలకు ఉచిత విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించడం, కార్మికులకు ఇళ్ళు నిర్మించుకొనేందుకు రుణాలు, ఇప్పటికే ఉన్న అన్ని ఇళ్ళలో ఏసిలు ఏర్పాటు చేయడం వంటి అనేకానేక హామీలను తెరాస ఎంపీ, టిబిజికెఎస్ కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటి ఇంతవరకు అమలుచేయకుండా సింగరేణి కార్మికులను కేసీఆర్ మోసం చేశారని రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
తమ యూపీయే ప్రభుత్వం గిరిజనులకు అటవీభూములపై హక్కులు కల్పిస్తూ చట్టం చేస్తే దానిని కేంద్రంలో మోడీ, ఇక్కడ తెలంగాణలో సిఎం కేసీఆర్ ఇద్దరూ అణచివేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. గిరిజనుల పోడు భూములను కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకొందని తాము అధికారంలోకి వస్తే మళ్ళీ వాటిని గిరిజనులకు అప్పగిస్తామని, వాటిపై వారికి హక్కులు కల్పిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే పైన పేర్కొన్న హామీలను అన్నిటినీ తప్పకుండా అమలుచేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.