
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రముఖ నటుడు ప్రకాష్ కుమార్కు హైదరాబాద్ వచ్చి సిఎం కేసీఆర్తో సమావేశం అవడం ఆ తరువాత ఆయన వెంటనే బెంగళూరు వెళ్ళి జెడిఎస్ అధినేత దేవగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామిలతో సమావేశమయ్యి ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న జెడిఎస్ పార్టీకి నా మద్దతు తెలుపుతున్నాను. వారు కోరితే నేను కర్నాటకలో వారి పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్దం,” అని ప్రకటించి హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. జెడిఎస్ ఆయనను ఎన్నికల ప్రచారం కోసం ఆహ్వానించలేదు. అదే వేరే విషయం. ఆ ఎన్నికలలో జెడిఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ గెలువలేకపోయినా రెండూ కలిసి కుమారస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగాయి. కుమార స్వామి ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందు సిఎం కేసీఆర్ మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఆయనను అభినందించి వచ్చారు.
కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరాటం చేస్తున్న తెరాసకు కుమారస్వామి మద్దతు పలుకలేదు. పలుకలేదనేకంటే పలుకలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కారణాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. జెడిఎస్ కాంగ్రెస్ పార్టీతో జత కట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించలేని పరిస్థితి ఏర్పడింది. అదీగాక కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా చంద్రబాబు, రాహుల్ గాంధీతో చేతులు కలిపి తెలంగాణలో కాంగ్రెస్-టిడిపిల మద్య పొత్తులు కుదిర్చారు. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలో తాను ఏర్పాటు చేయబోతున్న మహాకూటమిలో జెడిఎస్ ను కూడా భాగస్వామిగా మార్చగలిగారు. కనుక సిఎం కుమారస్వామి తెలంగాణలో తెరాసకు మద్దతు పలుకలేకపోయారని చెప్పవచ్చు.