
ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సభలో సిఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అమ్మ పెట్టాదు అడుక్కొని తిననీయదు అన్నట్లుంది కాంగ్రెస్, బిజెపిల తీరు. అవి పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఎక్కడా రూ.1,000 పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాయి కానీ ఇక్కడకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాయి. అలాగే ఆ రెండు పార్టీలు కలలో కూడా ఊహించలేని అనేక సంక్షేమ పధకాలను మా ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తోంది. ఐక్యరాజ్యసమితి సైతం మన రైతుబంధు పధకాన్ని ప్రశంసిస్తుంటే. కాంగ్రెస్, బిజెపిలకు మాత్రం కడుపు మంటగా ఉంది. ఆ రెండు పార్టీలు ఎన్నడైనా తమ రాష్ట్రాలలో రైతులకు సహాయపడేందుకు ఇటువంటి ఆలోచన అయినా చేశాయా?
ఆ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రంపై కర్రపెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా గణనీయంగా పెరిగింది. దానికి అనుగుణంగా వారికి రిజర్వేషన్లు ఇచ్చుకొంటామని తీర్మానం చేసి డిల్లీకి పంపితే మోడీ ప్రభుత్వం దానిని త్రొక్కిపట్టి పక్కనపడేసింది. రాష్ట్రాలపై కేంద్రం ఇటువంటి కర్రపెత్తనం పోవాలంటే, కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయవలసిందే. అప్పుడే రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా అనేక పార్టీలు నాకు మద్దతు పలికాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత దానిపై దృష్టి పెడతాను,” అని కేసీఆర్ అన్నారు.