సిఎం కేసీఆర్తో సహా తెరాస మంత్రులు, నేతలు అందరూ గొప్పగా చెప్పుకొంటున్న విషయాలలో రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా కూడా ఒకటి. ఇటీవల మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, “ప్రజాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్ళీ కరెంటు కోతలు మొదలైపోతాయని, తమ ప్రభుత్వం మాత్రమే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తోందని కేసీఆర్ చేస్తున్న వాదనకు మీ సమాధానం ఏమిటి? అని ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపుతూ, “నిజానికి ఇప్పుడు దేశంలో ఒకటో రెండో రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు అవసరమైన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి. కనుక ఇప్పుడు తెలంగాణతో సహా దాదాపు అని రాష్ట్రాలలో మిగులు విద్యుత్ ఉంది. కనుకనే తెలంగాణతో సహా దాదాపు అని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. కానీ కేసీఆర్ ఒక్క తెలంగాణలో తాను మాత్రమే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్నారు.
నిజానికి రాష్ట్రం ఏర్పడిన తరువాత అదిలాబాద్ జిల్లాలో జైపూరులో 1200 మెగావాట్స్ ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, భూపాలపల్లిలో 600 మెగావాట్స్ ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాయి. కాంగ్రెస్ హయాంలో ఈ రెంటి నిర్మాణపనులు ప్రారంభిస్తే, అవి కేసీఆర్ హయాంలో విద్యుత్ ఉత్పత్తికి సిద్దం అయ్యాయి. ఈ రెండూ కాకుండా కేసీఆర్ రాష్ట్రంలో ఒక్క కొత్త యూనిట్ పూర్తి చేయగలిగారా? ఒక్కో యూనిట్ ఆధానంగా విద్యుత్ ఉత్పత్తి చేయగలిగారా? రాష్ట్రంలో కూడా మిగులు విద్యుత్ ఉంది కనుకనే 24 గంటల విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నారు తప్ప ఇందులో ఆయన గొప్పేమీ లేదు. ప్రపంచంలో మరెక్కడా రైతుబందు పధకం లేదు ఒక్క తెలంగాణాలో మాత్రమే అమలుచేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న కేసీఆర్ మరి ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారో చెప్పగలరా?” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.