1.jpg)
సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ప్రజాకూటమి ఏర్పాటు, దాని విజయావకాశాలు, ముందస్తు ఎన్నికలు, ముఖ్యమంత్రి అభ్యర్ధి వంటి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మీడియాతో మాట్లాడారు.
ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ, “ఇవి తెరాసకు ముందస్తు ఓటమిని తెచ్చిపెట్టే ఎన్నికలు. మరో 9 నెలలు అధికారంలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ ఎటువంటి బలమైయన్ కారణం లేకుండా శాసనసభను రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళి చేజేతులా అధికారాన్ని పోగొట్టుకోబోతున్నారు. ముందస్తు ఎన్నికల గురించి ఆయన కట్టుకొన్న లెక్కలు ఫలించవు. ప్రజాకూటమి చేతిలో తెరాసకు ఓటమి తప్పదు,” అని అన్నారు.
ప్రజాకూటమి ఏర్పాటు గురించి మాట్లాడుతూ “మేము కేవలం సిఎం కేసీఆర్ను గద్దె దించడానికే మేము టిడిపితో చేతులు కలిపి ప్రజాకూటమిని ఏర్పాటు చేయలేదు. ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్, నరేంద్రమోడీ ఇద్దరినీ గద్దె దించడానికే ప్రజాకూటమి ఏర్పాటు చేశాము. చంద్రబాబు నాయుడు కూడా అదేపని మీద ఉన్నారు కనుక మా రెండుపార్టీల మద్య ఉన్న రాజకీయ శతృత్వాన్ని పక్కనపెట్టి ఆయన కూడా మాతో చేతులు కలిపారు. ప్రజాకూటమి ఒక నిర్ధిష్టమైన లక్ష్యంతో ఏర్పడింది కనుక ఈ ఎన్నికలలో గెలుపే ప్రధానమని భావించిన చంద్రబాబు నాయుడు టికెట్ల విషయంలో పెద్దగా పట్టుపట్టకుండా చాలా సంయమనంతో వ్యవహరించారు. మా రెండు పార్టీల లక్ష్యం ఒకటే కనుక చేతులు కలిపాము తప్ప కేసీఆర్ను చూసి భయపడి కాదు. కానీ కేసీఆర్ మేము తనను చూసి భయపడి ప్రజాకూటమిని ఏర్పాటు చేసుకొన్నామని నమ్మబలుకుతూ తెరాస శ్రేణులని, ప్రజలను కూడా మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు,” అన్నారు జైపాల్ రెడ్డి.
ప్రజాకూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారని విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించే ఆనవాయితీ లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో మాకే విజయావకాశాలున్నప్పటికీ అక్కడ మేము మా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళుతున్నాము. తెలంగాణలో కూడా అంతే. మా పార్టీ ప్రజాస్వామ్య విధానాలను అనుసరిస్తుంది. కనుక ఎన్నికల తరువాత ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకొంటారు,” అని చెప్పారు.