నేడు హైదరాబాద్‌ను రౌండ్ అప్ చేయనున్న ప్రముఖులు

ఈరోజు బిజెపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు అమిత్ షా, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో రోడ్ షోలు, సమావేశాలతో హడావుడి చేయబోతున్నారు. ఇక తెరాస, మజ్లీస్, బిఎల్ఎఫ్ తదితర పార్టీల హడావుడి ఎలాగూ ఉంటుంది. కనుక ఇవాళ్ళ హైదరాబాద్‌ నగరంలో రాజకీయ పార్టీల కోలాహలంతో కళకళలాడబోతోంది. 

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుదవారం ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాలలో రోడ్ షోలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు రామ్ నగర్ చౌరస్తా నుంచి రామ్ నగర్ గుండు, అడిక్ మెట్ చౌరస్తా మీదుగా అంబర్ పేట నియోజకవర్గంలో శంకరమఠం, నల్లకుంట మీదుగా ఫీవర్ ఆసుపత్రి వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. 

చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు ఈరోజు ఉదయం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు.          ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి నాంపల్లి, సికింద్రాబాద్‌లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. రాజకీయ హేమాహేమీలు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు కనుక నగరంలో వారు పర్యటించే ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.