
ఖమ్మం జిల్లా తెరాస నేత బుడన్ బేగ్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బుదవారం ఖమ్మం పట్టణంలో జరుగనున్న ప్రజాకూటమి సభలో టిడిపిలో చేరబోతున్నారు. ఉద్యమసమయం నుంచి తెరాసలో పనిచేస్తున్న ఆయన ఈసారి ఖమ్మం నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నారు. కానీ టికెట్ లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయనను టిడిపి నేత నామా నాగేశ్వరరావు పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన రేపు టిడిపిలో చేరేందుకు సిద్దమవుతున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జిల్లాలో ముఖ్యనేతగా ఉన్న బేగ్ పార్టీ మారేయత్నంలో ఉన్నట్లు తెలియగానే తెరాస అగ్రనేతలు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన టిడిపిలో చేరాలని నిర్ణయించుకొన్నారు. తెరాసకు బిజెపితో రహస్య అవగాహన కలిగిఉండటం నచ్చకనే పార్టీ వీడుతున్నానని, దేశంలో లౌకికవాద, బిజెపియేతర పార్టీలను సంఘటితం చేయడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను చూసి టిడిపిలో చేరాలని నిర్ణయించుకొన్నానని బేగ్ చెప్పారు.