
గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా సిఎం కేసీఆర్పై పోటీకి దిగిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే, కాంగ్రెస్ పెద్దల నుంచి ఆయనకు ఎటువంటి సహాయసహకారాలు లభిస్తున్నట్లు కనిపించడం లేదు. గత 3-4 వారాలుగా గజ్వేల్ లో పోలీసులు తనను తన కుటుంబ సభ్యులను, తన అనుచరులను సోదాల పేరుతో ఇళ్లలోకి జొరబడి వేధిస్తున్నారంటూ ఆయన గజ్వేల్ రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో వంటేరు ప్రతాప్ రెడ్డి రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందే నిరాహార దీక్షకు కూర్చొన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఆయన ఆరోపణలు నిజమని దృవీకరిస్తున్నట్లు సోమవారం రాత్రి పోలీసులు కొంపల్లిలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు, వంటేరుకు మద్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ సంగతి తెలుసుకొన్న కాంగ్రెస్ కార్యకార్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొని పోలీసుల తీరును నిరసిస్తూ వంటేరు ఇంటి ముందు బైటాయించి నిరసనలు తెలియజేశారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా అర్దరాత్రి తన ఇంటిలో సోదాలు నిర్వహించమని మిమ్మల్ని ఎవరు పంపించారని వంటేరు పోలీస్ అధికారులను గట్టిగా ప్రశ్నించారు. ఒకవేళ పోలీసులు తాం తీరు మార్చుకోకపోతే వారి ముందే ఆత్మహత్య చేసుకొంటానని వంటేరు హెచ్చరించారు. కానీ తాము తమ విధులను నిర్వర్తిస్తున్నామని కనుక తమకు అడ్డుపడవద్దని చెపుతూ వారు వంటేరు నివాసంలో సోదాలు నిర్వహించారు. కానీ మధ్యం, డబ్బు కట్టలు కనిపించకపోవడంతో వారు వెనుతిరిగారు. దీనిపై వంటేరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్పై బిజెపితో సహా ఇంకా వివిద పార్టీల అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధులు కూడా పోటీ చేస్తున్నారు. కానీ వంటేరు ప్రతాప్ రెడ్డిపైనే పోలీసులు ఎక్కువ దృష్టి సారించి వేధిస్తున్నారని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్కు వంటేరు గట్టి పోటీ ఇస్తున్నందునే భయపడి పోలీసుల చేత వేధింపులకు గురిచేస్తూ ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోనీయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని, తనను తన అనుచరులను పోలీసులు వేధిస్తున్నారని వంటేరు ఆవేధన వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ భారీ మెజార్టీతో గెలవగలరని మంత్రి హరీష్ రావు నమ్మకంగా చెప్పుతున్నారు కనుక ఎన్నికల ప్రచారం నిలిపివేద్దాము సిద్దమేనా? అని వంటేరు ప్రతాప్ రెడ్డి సవాలు విసిరారు.
తెరాసతో ఒంటరి పోరాటం చేస్తున్న వంటేరుకు కాంగ్రెస్ పెద్దలు ఎవరూ ఎందుకు అండగా నిలబడటం లేదో వారికే తెలియాలి.