తెరాసలో ఎవరికీ ఆ విషయం తెలియదు: కొండా

తెరాస పార్టీకి, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెరాస విధానాల గురించి, ఆ పార్టీ నేతలు, ఎంపీలు, మంత్రుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెరాసలో ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నామో నాకు అర్ధంకాక ఎంపీ జితేందర్ రెడ్డిని అడిగాను. ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా న్యూస్ పేపర్లలో చూడటం లేదా? ఆ మాత్రం అర్ధం కాదా? అంటూ ఎదురు ప్రశ్న వేసి తప్పించుకొన్నారు. ఆ తరువాత మరో ఎంపీ కె కేశవరావును అదే ప్రశ్న అడిగితే ఆయన నవ్వి ఊరుకొన్నారు. అంటే వారిరువురికీ కూడా తెలియదని స్పష్టం అయ్యింది. కానీ నాకు తెలిసినంత వరకు సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీతో ఏదో ఒప్పందం చేసుకొనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లు భావిస్తున్నాను. 

ఒకప్పుడు తెరాసలో అందరూ ‘జై తెలంగాణ’ అనేవారు. కానీ ఇప్పుడు అందరూ జై కేసీఆర్‌...జై కేటిఆర్‌ అంటున్నారు. అంటే పార్టీ విధానంలో ఎంత మార్పు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్కా సుమన్ ఇద్దరూ కేటిఆర్‌ చెప్పిన మాటలనే వల్లె వేస్తుంటారు. అలాగే నేను ఎప్పుడైనా తాండూర్ వెళుతుంటే వెంటనే కేటిఆర్‌ నుంచి ఫోన్ వచ్చేది ‘అన్నా నువ్వు అటువైపు వెళ్లకు మహేంద్రన్నకు నచ్చదు,’ అని ఆదేశం వచ్చేది.            

ఇక రాష్ట్ర బడ్జెట్ గురించి ఆర్ధికమంత్రి ఈటలకు తెలియదు. హోంశాఖలో అధికారుల బదిలీల గురించి పేపర్లలో, టీవీలలో వచ్చే వార్తలు చూసి హోంమంత్రి నాయిని తెలుసుకొంటుంటారు. తెరాసలో చాలా మంది మంత్రులు, ఎంపీలు, నేతల పరిస్థితి ఇదే. పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ పై అన్ని పార్టీలు జోరుగా చర్చిస్తుంటే మేమందరం చల్లగా బయటకు జారుకోవలసిరావడం నాకు చాలా సిగ్గు అనిపించింది. మా పరిస్థితి చూసి పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీలు నవ్వుకొంటుంటే నాకు చాలా అవమానంగా అనిపించేది. ఈ అవమానాలు భరించలేకనే నేను తెరాసను విడిచిపెట్టాను. త్వరలోనే జితేందర్ రెడ్డి, కె కేశవ రావు కూడా తెరాసకు గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి,” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 

ఆయన వ్యాఖ్యలపై ఎంపీ జితేందర్ రెడ్డి స్పందిస్తూ, “ఆయన వ్రాసిన రాజీనామా లేఖ చివరి పేరాలో ‘నేటికీ నాకు సిఎం కేసీఆర్‌ నాయకత్వం అంటే చాలా గౌరవం ఉందని’ స్వయంగా వ్రాశారు. గౌరవం ఉందంటూనే సిఎం కేసీఆర్‌ గురించి, తెరాస విధానాల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతో ఆయన పార్టీ మారాలనుకొంటే  మారవచ్చు కానీ పార్టీ మారేక పార్టీలో అవమానం జరిగిందంటూ ఈవిధంగా మాట్లాడటం సరికాదు,” అని అన్నారు.