అంత ఆవేదన ఎందుకమ్మా నీకు?

ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీల ఎన్నికల ప్రచారం చాలావాడివేడిగా సాగుతోంది. మొన్న మేడ్చల్ సభలో పాల్గొన్న సోనియా గాంధీ, “తెలంగాణ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. తెలంగాణ ప్రజల కోసం మేము తెలంగాణ ఏర్పాటు చేస్తే అది కేసీఆర్‌ కుటుంబసభ్యుల చేతిలో బందీ అయ్యింది,” అంటూ చాలా విమర్శలు చేశారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని అదే సభలో ప్రకటించారు. సోనియాగాంధీ ప్రసంగంపై సిఎం కేసీఆర్‌ ఈరోజు చాలా తీవ్రంగా స్పందించారు. 

ఆదివారం దేవరకద్రలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడుతూ, “సోనియామ్మా! నీ కడుపు ఎందుకు తరుక్కుపోతోంది? రాష్ట్రం నుంచి డిల్లీకి డబ్బు మూటలు బంద్ అయినందుకా? లేక రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తునందుకా? లేక మీరు అనేక దశబ్ధాలలో చేయలేని పనులను మేము కేవలం నాలుగేళ్ళలో పూర్తిచేసి చూపుతునందుకా? రాష్ట్రంలో అంతా జరగకూడనిది ఏమి జరిగిపోయింది? అసలు దేనికి మీ కడుపు తరుక్కుపోతోంది?

మాగడ్డ మీద నిలబడి మాకు నష్టం కలిగించే విధంగా పొరుగు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారంటే మీకు తెలంగాణపై ఎంత ప్రేమ ఉందో అర్ధం అవుతోంది. మీకు ఆ ఉపన్యాసం ఎవరు రాసిచ్చారో తెలియదు కానీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ రాష్ట్రం నష్టపోకుండా తెలంగాణకు కూడా హోదా ఇస్తారా లేదా? అని నేను 4 కోట్లు తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. రాహుల్ గాంధీ మళ్ళీ ఎప్పుడు తెలంగాణకు వచ్చినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి.

నాలుగేళ్ళలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొంటుంటే అందుకు సంతోషించవలసింది పోయి కాంగ్రెస్‌ నేతలు అడుగడుగునా అడ్డు పడుతున్నారు. పైగా నిసిగ్గుగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారు. కనుక ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మహాకూటమికి మీ ఓటుతో గట్టిగా బుద్ది చెప్పాలి. మన రాష్ట్రంలో ఈ అభివృద్ధి, ఈ సంక్షేమ పధకాలు యధాతధంగా సాగాలంటే తెరాసకే ఓటు వేసి గెలిపించాలి,” అని అన్నారు.