తెరాస పోటీ నాతో కాదు...ప్రజలతో: మల్ రెడ్డి రంగారెడ్డి

సీనియర్ కాంగ్రెస్‌ నేత మల్ రెడ్డి రంగారెడ్డి కొన్ని అనివార్య కారణాల వలన బిఎస్పీ టికెట్ పై పోటీ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రజలతో నాకు విడదీయరాని అనుబందం ఉంది. నన్ను వారి కుటుంబ సభ్యులలో ఒకడిగా భావిస్తుంటారు. నేను కూడా వారందరినీ నా కుటుంబ సభ్యులుగానే భావిస్తుంటాను. అందుకే నేను నా ఎన్నికల గుర్తు ‘ఏనుగు’ అని నేను ఎవరికీ చెప్పకపోయినా వారే తెలుసుకొని నలుగురికీ చెపుతున్నారు. 

ఇబ్రహీంపట్నం అంటే మల్ రెడ్డి రంగారెడ్డి. మల్ రెడ్డి రంగారెడ్డి అంటే ఇబ్రహీంపట్నం. కనుక ఇక్కడ నా గురించి నేను పనిగట్టుకొని చెప్పుకోవలసిన ఆవసరమే లేదు. నాకు ఇక్కడి ప్రజలతో అంత అనుబందం ఉంది కనుకనే నా గెలుపు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. అయితే తెరాస అభ్యర్దికి ఈ విషయం తెలియక నాతో పోటీ పడుతున్నాననే భ్రమలో ఉన్నాడు. నిజానికి అతను పోటీ పడుతున్నది నాతో కాదు ఇబ్రహీపట్నం ప్రజలతో. కనుక నన్ను ఓడించగలననుకొంటే ఆ ప్రజలను ఓడించగలననుకోవడమే. అది ఎంత గొప్ప నాయకుడికైనా సాధ్యం కాదని అందరికీ తెలుసు. 

నాలుగేళ్లపాటు అధికారంలో ఉన్న తెరాస ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి చేసిన ఉపకారం మేలు ఏమీ లేదు కానీ ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జాలు చేయించాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గాన్ని అద్బుతంగా తీర్చిదిద్దామని గొప్పలు చెప్పుకొంటున్న తెరాస నేతలు హైదరాబాద్‌ను ఆనుకొనే ఉన్న ఇబ్రహీపట్నం చూస్తే సిగ్గుతో తలాదించుకోకతప్పదు. ఇక్కడ రోడ్లు వేయలేదు. మురుగు కాలువలను పట్టించుకోలేదు. కనీసం పేదలకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. పేదలకు కట్టిస్తానని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళన్నీ కాగితాల మీదనే ఉండిపోయాయి. అవి గాలి మేడలు...గాలి కబుర్లుగానే మిగిలిపోయాయి. 

తనను గెలిపించిన ఇబ్రహీంపట్నం ప్రజలకు తెరాస ఎమ్మెల్యే కృతజ్ఞత చూపకపోగా యాచారం మండలంలో వారి నెత్తిన విషవాయువులను చిమ్ముతూ, భూగర్భజలాలను కలుషితం చేసే ఫార్మా సిటీని తెచ్చిపెడతానని గొప్పగా చెపుతూ ప్రజల ప్రాణాలతో చెలాగటం ఆడుతున్నాడు. ఓటేసిన ప్రజల రక్తం పీల్చుకొని త్రాగే ఇటువంటి వారికి చూస్తూ చూస్తూ మళ్ళీ ఎవరైనా ఓటేస్తారా? నేను గెలిచిన తరువాత ఈ ఫార్మా సిటీని ఈ ప్రాంతానికి దూరంగా తరలింపజేయడానికి గట్టిగా కృషి చేస్తాను. 

గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రాతినిధ్యం వహించిన రంగారెడ్డి జిల్లాలో 22 గ్రామాలలో అత్యంత పరిశుభ్రత, మౌలికవసతులు కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మల్ పురస్కారం అందుకొన్నాను. కనుక ఇన్నాళ్లుగా తెరాస నేతల వివక్షకు, నిర్లక్ష్యానికి గురైన నా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని మళ్ళీ నందనవనంలా తీర్చిదిద్దుకొంటాను. ఎందుకంటే, ఇదే నా ఇల్లు..ఇదే నా ఊరు... ఈ ప్రజలే నా కుటుంబ సభ్యులు కనుక. 

ఇబ్రహీంపట్నంలో ఎవరికి ఎటువంటి కష్టమొచ్చినా వారికి నేను అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అండగా నిలబడుతుంటాను. ఇక ముందు కూడా ఇలాగే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో రోడ్లు, మురుగు కాలువలు, త్రాగునీరు, ప్రాధమిక వైద్య సౌకర్యాలు కల్పనపై దృష్టి పెట్టి యుద్ధప్రాతిపదికన ఆ పనులన్నీ పూర్తి చేస్తాను,” అని అన్నారు.