
మజ్లీస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీకి నోటి దురుసు కాస్త ఎక్కువేనని అందరికీ తెలుసు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ పాతబస్తీలో మజ్లీస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ, “రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా వారు మన ముందు తలదించుకొని నిలబడవలసిందే. ఆనాడు వైయెస్సార్ కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇప్పుడు కేసీఆర్ కావచ్చు....ఎవరైనా మనముందు చేతులు కట్టుకొని నిలబడవలసిందే. ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వ పగ్గాలు ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటాయి అవునా కాదా? ఒక్కసారి నేను రాష్ట్రంలో పర్యటిస్తే మన సత్తా ఏమిటో అందరికీ అర్ధం అవుతుంది. ఈ ఎన్నికల తరువాత కూడా మళ్ళీ అదే జరుగబోతోంది. అధికారమనే త్రాసు మన చేతిలోనే ఉండబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో మనమే నిర్ణయించబోతున్నాము. డిసెంబరు11 వతేదీన దీనిని యావత్ ప్రపంచం చూడబోతోంది,” అని అన్నారు.
కర్నాటకలో కేవలం 36 సీట్లు గెలుచుకొన్న జెడియు అధికారంలోకి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి పునరావృతం కావచ్చునని అప్పుడు మజ్లీస్ పార్టీకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించినా ఆశ్చర్యం లేదని అక్బరుద్దీన్ రెండు నెలల క్రితం అన్నారు.
అంటే తెలంగాణలో తెరాస లేదా మహాకూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మెజార్టీ రాదని, అప్పుడు తమ 8 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం తెరాస లేదా మహాకూటమి నేతలు తమ ముందు చేతులు కట్టుకొని నిలబడక తప్పదని అసదుద్దీన్ చెపుతున్నారు. అయితే ఈసారి ఎన్నికలలో తెరాస 100కు పైగా సీట్లు గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని తెరాస నేతలు, కనీసం 80 సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ నేతలు నమ్మకంగా చెపుతుంటే, ఆ రెండు పార్టీలు తామంతట తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని అక్బరుద్దీన్ చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయినా తెరాస మాకు మిత్రపక్షమని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెపుతుంటే, ఆయన తమ్ముడు కేసీఆర్‌ను ఉద్దేశ్యించి ఈవిధంగా అనుచితంగా మాట్లాడటం దేనికి సంకేతం? తెరాసతో మజ్లీస్ దోస్తీ నిజమైన దోస్తీ కాదా? కేవలం అవకాశవాద రాజకీయమేనా?అయినా 8 సీట్లలో మజ్లీస్ అభ్యర్ధులు గెలుస్తారో లేదో ఇంకా తెలియకుండానే ఇంత అహంభావం ప్రదర్శిస్తే రేపు వారిలో కొంతమంది ఓడిపోతే జనాలకు మొహం చూపించగలమా? అని ఆలోచించుకొని అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే మంచిది.