కేసీఆర్ మాట నిలకడ లేని వ్యక్తి: సోనియా గాంధీ

ఈరోజు సాయంత్రం మేడ్చల్ లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు మహాకూటమి నేతలు కోదండరామ్‌(టిజేఎస్), చాడా వెంకటరెడ్డి (సిపిఐ), ఎల్ రమణ (టిడిపి), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ), మందకృష్ణ మాదిగ (ఎం.ఆర్.పి.ఎస్.), ప్రజాగాయకుడు గద్దర్, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో హేమాహేమీలు అనేకమంది విద్యావేత్తలు, యువనేతలు హాజరయ్యారు. 

ఈ సభలో ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, కోదండరామ్‌ తదితరులు ప్రసంగించారు. వారందరూ ‘తెరాస ఓడిపోతే ఫాంహౌసుకు వెళ్ళి పడుకొంటానన్న’ కేసీఆర్‌ మాటలను గుర్తు చేసి, ఆయన కోరిక అతి త్వరలోనే తీరబోతోందని నొక్కి చెప్పారు. 

సోనియాగాంధీ మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలను చూస్తునప్పుడు ఒక తల్లికి చాలా కాలం తరువాత తన బిడ్డలను చూసుకొన్నంత ఆనందం నాకు కలుగుతోంది. తెలంగాణ ఏర్పాటుకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో మీ అందరికీ తెలుసు. ఒకపక్క ఆంధ్రాలో మా పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా మీ అందరి ఆకాంక్షలు నెరవేరుతాయని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్‌ చేతిలో పెడితే ఆయన దానిని నాలుగేళ్ళలో పూర్తిగా భ్రష్టు పట్టించారు. సరైన పెంపకం లభించని ఒక చిన్న పిల్లాడి భవిష్యత్  ఏవిధంగా పాడయిపోతుందో, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు సరైన నాయకత్వం లేని కారణంగా తెలంగాణ భవిష్యత్ కూడా అయోమయంగా మారింది. మాట మీద నిలబడలేని వ్యక్తులను నమ్మలేము. తెలంగాణ ప్రజలు దేనికోసమైతే పొరాడి రాష్ట్రాన్ని సాధించుకొన్నారో ఆ ఆకాంక్షలు నెరవేరాలంటే, మహాకూటమిని గెలిపించుకోవాలి,” అని అన్నారు.

రాహుల్ గాంధీ కూడా ఇంచుమించు తల్లి చెప్పిన మాటలనే చెప్పారు. నాలుగేళ్ళ కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని అన్నారు. కేసీఆర్‌ తన నలుగురు కుటుంబ సభ్యుల కోసమే రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్లు నడిపించారని విమర్శించారు. కానీ మహాకూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్కరి కోసమో కాకుండా రాష్ట్ర ప్రజలందరి కోసం పనిచేస్తుందని అన్నారు.