అది కేసీఆర్‌ అతితెలివికి పరాకాష్ట: రేవంత్‌రెడ్డి

మేడ్చల్‌లో రేపు జరుగబోయే సోనియా, రాహుల్ గాంధీల బహిరంగసభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి గోదావరి, కర్నాటక నుంచి కృష్ణా నదులు ప్రవహిస్తుంటాయి. కనుక ఎగువ రాష్ట్రాలు ఆ నీటిని విడిచిపెడితేనే తెలంగాణకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నీళ్ళు విడిచిపెడితేనే దిగువన ఉన్న ఆంధ్రాకు నీళ్ళు వెళతాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు నిజంగానే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నించినా అడ్డుకోగలరా? అది సాధ్యమేనా? సాధ్యమైతే తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించగలుగుతోంది?

కెసిఆర్ తన చాతగానితనాన్ని, అవినీతిని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులను అడ్డుకొంటున్నారని వాదిస్తున్నారు. అయితే ఈ వాదన ఆయన అతితెలివికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అవసరం లేకపోయినా రీ-డిజనింగ్ పేరిట ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచేసి అవినీతికి పాల్పడిన కేసీఆర్‌పై మేము అధికారంలోకి చట్టప్రకారం చర్యలు తీసుకొంటాము. ఆయన, కుటుంబ సభ్యుల విచారణ జరిపించి అవినీతిని బయటపెడతాము. కనుక కేసీఆర్‌ దేశం విడిచిపారిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి,” అని అన్నారు.