తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవాళ్ళ మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుంది. కనుక అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తిరుగుబాటు అభ్యర్ధులను బుజ్జగించి వారిచేత నామినేషన్లు ఉపసంహరింపజేయడానికి ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేతలు మల్ రెడ్డి సోదరులు బిఎస్పీ స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. వారిలో మల్ రెడ్డి రంగారెడ్డికి మద్దతుగా ఆయన సోదరుడు మల్ రెడ్డి రామిరెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు. అలాగే ఆయనకు మద్దతుగా టిడిపి అభ్యర్ధి సామ రంగారెడ్డి కూడా పోటీ నుంచి విరమించుకొన్నట్లు తాజా సమాచారం.
కాంగ్రెస్ రెబెల్ అభ్యర్ధులుగా నామినేషన్లు వేసిన నాయిని రాజేందర్‌రెడ్డి-వరంగల్ పశ్చిమ, అనిల్‌కుమార్-పటాన్‌చెరు, వడ్డేపల్లి రవి-తుంగతుర్తి, బిల్యానాయక్-దేవరకొండ, అమరేందర్‌రెడ్డి-మిర్యాలగూడ, జగదీశ్వర్‌రావు-కొల్లాపూర్, బి.మధుసూదన్‌రెడ్డి-దేవరకద్ర, కొమిరెడ్డి రాములు-కోరుట్ల, గాలి మాల్యాద్రిరెడ్డి-బాన్సువాడ, సున్నం నాగమణి-అశ్వారావుపేట సుభాషణ్‌రెడ్డి-ఎల్లారెడ్డి లతో డిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు నేరుగా వారితో మాట్లాడి, వారికి భవిష్యత్తులో పదవులకు హామీలు ఇచ్చి వారిచేత నామినేషన్ల ఉపసంహరింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వారిలో చాలా మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
మొత్తం 634 మంది రెబెల్, స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిస్తే వారిలో ఎంతమంది బరిలో ఉంటారనే విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది.