తెరాసకు మరో షాక్!

సిఎం కేసీఆర్‌ సెప్టెంబరు 6న ఒకేసారి 105 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన తరువాత గుప్పుమన్న అసమ్మతి నామినేషన్లు ముగిసే సరికి చల్లబడిందనుకొంటుంటే, నిన్న చేవెళ్ళ తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి 23న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 24 గంటలు గడువక మునుపే వికారాబాద్ తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు కూడా తెరాసకు గుడ్ బై చెప్పేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి మహేందర్ రెడ్డి నాకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారు. నేను నమ్మిన వారే నన్ను నమ్మకంగా నట్టేట ముంచారు. సిటింగ్ ఎమ్మెల్యేనైన నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి (మెతుకు ఆనంద్)కు ఎందుకు టికెట్ కేటాయించారో అందరికీ తెలుసు. నాకు పార్టీలో ఘోర అవమానం జరిగింది. అందుకే నేను తెరాసను విడిచిపెడుతున్నాను. నా అనుచరులతో మాట్లాడుకొని నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. వికారాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ కు మద్దతు ప్రకటిస్తున్నాను. ఆయన గెలుపుకు నేను అన్ని విధాలాసహకరిస్తాను,” అని చెప్పారు. 

ఇక నిన్న హుజూరాబాద్ లో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు తెరాసలో చేరి కాంగ్రెస్‌ పార్టీకి షాక్ ఇవ్వగా, ఇవాళ్ళ మధిరలో ఐదుగురు తెరాస కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి తెరాసకు షాక్ ఇచ్చారు. అయితే వారు తెరాసకు చెందినవారు కాదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను, తెరాస శ్రేణులను తప్పుదారి పట్టించేందుకే ఇతర పార్టీల కార్యకర్తలను చేర్చుకొని వారు తెరాస నేతలని ప్రచారం చేస్తున్నారని తెరాస నేత కొండబాల కోటేశ్వరరావు మీడియాకు తెలియజేశారు.