.jpg)
తెలంగాణలో ముందస్తు ఎన్నికల గంట మ్రోగించినప్పటి నుంచి తెరాస ఒకే ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీని గట్టిగా నిలదీసి అడుగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దానికి సూటిగా జవాబు చెప్పడంలేదు. ఈరోజు దేవరకొండ బహిరంగసభలో కూడా సిఎం కేసీఆర్ మళ్ళీ అదే ప్రశ్న అడిగారు.
“తెలంగాణలో పరాయిపాలన విరగడ అయ్యిందని ప్రజలు అందరూ సంతోషిస్తుంటే, కాంగ్రెస్ నేతలు మళ్ళీ చంద్రబాబు నాయుడుని తమ భుజాల మీద ఎందుకు మోసుకువస్తున్నారు? ప్రజలు అందరూ పోరాడి రాష్ట్రం సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు చేతికి ఎందుకు అప్పగించాలనుకొంటున్నారు? తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న చంద్రబాబు నాయుడు కంటే ముందు ఆయనను భుజాల మీద మోసుకువస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు గట్టిగా దంచి బుద్ధి చెప్పాలి. ఒకవేళ పొరపాటున మహాకూటమికి అధికారం కట్టబెడితే రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ మొదటికొస్తాయని గుర్తుంచుకోవాలి. కనుక మన రాష్ట్రం కోసం...మన అభివృద్ధి, మన సంక్షేమం కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న తెరాసను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలసిన బాధ్యత ప్రజలదే,” అని సిఎం కేసీఆర్ అన్నారు.