హైదరాబాద్ లోని సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో మొత్తం 21 మందికి దూరపుచూపు రావడానికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేయగా.. అందులో రెండో థియేటర్లో చేసిన 13 మందికి చూపు రాకపోగా ఉన్న చూపుపోయి, ఇన్ఫెక్షన్ సోకింది. అయితే ఇందులో మా తప్పేమీ లేదని డాక్టర్లు అంటున్నారు. సర్జరీకి ముందు గత యాభై ఏళ్లుగా రింగర్ లాక్టైడ్తోనే కళ్లను శుభ్రం చేస్తున్నామని వారు వెల్లడించారు. తాజాగా కూడా అదే సొల్యూషన్ తో శుభ్రం చేశామని.. అయితే సర్జరీ చేసిన తెల్లారి కట్లు విప్పితే ఇన్ఫెక్షన్ చేరినట్లు గుర్తించామని దానికి మళ్ళీ మళ్ళీ ఆపరేషన్లు చేశామని డాక్టర్లు తెలిపారు. 2018 వరకు ఎక్స్పైరీ డేట్ ఉన్న 1,68,38,485 బ్యాచ్ రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో కంటి చూపుకు కనబడని క్లెబ్సీల్లా బ్యాక్టిరీయా చేరడం వల్లనే బాధితుల చూపుకు ప్రమాదం ఏర్పడిందని డాక్టర్లంటున్నారు.
సరోజిని దేవి ఆస్పత్రిలో 13 మంది కంటి చూపుపోవడానికి కారణమైన ఆ సొల్యూషన్ ఉత్పత్తి చేసిన నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాస్యూటికల్ సంస్థపై 2013లోనే కేసులు నమోదయ్యాయని, వీరి ఉత్పత్తులను మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్, గోవా లాంటి రాష్ట్రాలు బ్యాన్ చేశాయని కూడా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి మరీ డాక్టర్లు చెబుతున్నారు. నిజానికి ‘చూపు’ పోవడానికి అసలు కారణాలేంటని, ప్రభుత్వం ఇటీవల నియమించిన నిపుణుల కమిటీ తేల్చాల్సి ఉంది. అంతేకాదు ఈ మందులను కొనుగోలు చేసే తెలంగాణ రాష్ర్ట వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్ ఎంఎస్ఐడిసి)లో కేవలం ఇంజనీర్లే ఉన్నారు. వీళ్ళు బిల్డింగ్ కట్టడానికి మాత్రమే అర్హులు. అలాంటి వారి ద్వారా వైద్యులకు అవసరమైన ఉత్పత్తులు కొనుగోలు చేయించడం తప్పు. కొనుగోలు చేసే నిర్ణాయక సంస్థలో తమకు భాగస్వామ్యం లేకపోవడం ఈ అన్ని అనర్థాలకు మూలమని డాక్టర్లు తమ పక్షాన చెబుతున్నారు. మరోవైపు డాక్టర్ల ఇండెంట్, అవసరాలు/డిమాండ్ మేరకే ఈ మందుల్ని కొనుగోలు చేస్తున్నామని, ఉమ్మడి రాష్ర్టంలో కూడా ఇలాగే కొనుగోళ్ళు జరిగాయని, ఏ ఆస్పత్రికి ఆ సూపరింటెండెంట్ కొనుగోలు చేసేకంటే అన్ని రకాల నిబంధనలకు లోబడి టెండర్లు పిలిచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లయితే రాష్ర్ట ఖజానాకు మేలు జరుగుతుందని ఈ సంస్థ జవాబిస్తోంది.
మొత్తం మీద ఇవ్వాళ 13 మందిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళకు చూపు రావడమనేది దేవుడి దయ మీద ఆధారపడి ఉంది. అంతంత మాత్రం ఉన్న చూపు.. బాగుపడుతుంది కదా అని ఆస్పత్రికి వెళితే ఇలా జరిగింది. దీనికి మా తప్పేమి లేదని ప్రభుత్వ డాక్టర్లు చెబుతున్నారు. కానీ డాక్టర్లను అరెస్టుచేసి కేసులు పెట్టాలని కొంత మంది కోర్టు మెట్లెక్కారు. కాగా తమ డాక్టర్లను అరెస్టు చేస్తే మొత్తం ప్రభుత్వ దవాఖానాలను స్థంభింపజేస్తామని డాక్టర్ల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌ని అంతర్జాతీయ మెడికల్ టూరిజం కేంద్రంగా చేయాలని తెలంగాణ రాష్ర్టప్రభుత్వం భావిస్తోంది. వైద్యం, వసతులు కల్పించి రోగ గ్రస్తులకు చికిత్స చేసి స్వాస్థత కల్పించి అటు ఆరోగ్యం, ఇటు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరి ఇలాంటి సందర్భంలో సరోజినిదేవి ఆస్పత్రిలో జరిగిన ఘటనలు మళ్లీ జరిగితే తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నదానికి ముందుకే మోక్షం లేకుండా పోతుుంది. మరి దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే స్పందించి.. ముందుగా చూపు కోల్పోయిన వారికి వైద్యం అందేలా చెయ్యాలి. మొత్తం వ్యవహారానికి బాధ్యులను శిక్షించి, ఇలాంటి ఘటనలు ముందు పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.