తెలంగాణ సిఎం కేసీఆర్ ఈ నెల 16న దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే ఇంటర్‌స్టేట్ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఇందుకు సంబంధించి.. పీఎంవో నుంచి ఈ సమావేశంలో జరిగే ఏజెండాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రం పంపించిన ఎజెండాలోని నాలుగు అంశాలపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్షించారు. ముఖ్యంగా శాఖలవారీగా కేంద్ర, రాష్ట్ర సమస్యలు, ఆధార్‌లో రాష్ట్ర ప్రగతి, విద్యా విధానంలో తీసుకొస్తున్న సంస్కరణలు, రాష్ట్ర అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
పదేళ్ల తర్వాత జరుగుతున్న అంతర్రాష్ట్ర కౌన్సిల్ సమావేశం వేదిక, హైదరాబాద్ హౌస్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు మారింది. తొలుత హైదరాబాద్ హౌస్‌లో జరపాలనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో వేదికలో మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16వ తేదీన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఐదారు అంశాలపై చర్చ జరిగే విధంగా అంతర్రాష్ట్ర కౌన్సిల్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎజెండా రూపొందించాయి. తొలి ఎజెండాలో కేవలం రెండు అంశాలను మాత్రమే పేర్కొనగా రెండవ ఎజెండాలో మరికొన్ని అంశాలను పేర్కొన్నాయి.
తొలి ఎజెండా ప్రకారం కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం ఫూంఛీ ఏడు సంపుటాల్లో చేసిన 273 సిఫారసులపై చర్చ జరుగనున్నది. ఇక రెండవ ప్రధాన అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలు, రాయితీలు, ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు గుర్తింపును ప్రామాణికంగా తీసుకునే అంశంపై చర్చ జరగనున్నది. ప్రస్తుతం ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ 18 ఏండ్ల పైబడిన వయసువారికి 96% పూర్తికాగా, 18 ఏళ్లలోపు వారికి మాత్రం నామమాత్రంగానే జారీ అయ్యాయి. అంతర్రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి సీఎంతో పాటు సీఎస్‌కి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు హోం మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.