టిజేఎస్, సిపిఐ రేపు అభ్యర్ధుల ప్రకటన

మహాకూటమిలో భాగస్వాములుగా ఉన్న తెలంగాణ జనసమితి (టిజేఎస్), సిపిఐ పార్టీలు బుదవారం తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తాయని ఆ పార్టీల నేతలు కోదండరామ్‌, చాడా వెంకటరమణ మీడియాకు తెలియజేశారు. 

కోదండరామ్‌ మీడియాతో మాట్లాడుతూ, “మేము కాంగ్రెస్ పార్టీని 11 సీట్లు అడిగాము. వాటిలో మల్కాజ్‌గిరి, మెదక్‌, దుబ్బాక, సిద్దిపేట, వర్థన్నపేట, అంబర్‌పేట స్థానాలపై మాకు స్పష్టత వచ్చింది. కనుక ఆ ఆరు స్థానాలకు రేపు మా అభ్యర్ధులను ప్రకటిస్తాము,” అని చెప్పారు. జనగామ నుంచి తాను పోటీ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరామ్‌ చెప్పారు.   

చాడా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ, “మేము కాంగ్రెస్ పార్టీని నాలుగు సీట్లు కోరాము. కానీ మూడు సీట్లే కేటాయించింది. మహాకూటమి లక్ష్యం నెరవేరడం కోసం మేము సర్దుకుపోవాలని నిర్ణయించాము. కనుక మాకు కేటాయించిన వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు రేపు మా అభ్యర్ధులను ప్రకటిస్తాము. అయితే నల్గొండ జిల్లాలో ఒక సీటును మాకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందనే ఆశిస్తున్నాము,” అని చెప్పారు.