
డిల్లీలో నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, రేవంత్రెడ్డి,సీనియర్ నేతలు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క దానికి హాజరయ్యారు. గత సమావేశంలో 57 మంది ముఖ్యనేతల పేర్లు ఖరారు చేసిన స్క్రీనింగ్ కమిటీ, ఈరోజు సమావేశంలో మిగిలిన 38 మంది పేర్లు ఖరారు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే మహాకూటమిలో మిత్రపక్షాలకు ఇవ్వవలసిన స్థానాలపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకొనబోతున్నట్లు సమాచారం.
ఒకవేళ టిడిపికి-14, టిజేఎస్-8, సిపిఐ-9 సీట్లు ఇవ్వదలిస్తే కాంగ్రెస్ 88 సీట్లకే పరిమితం కావలసి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కనీసం 90 స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాలని భావిస్తోంది. కనుక సీట్ల విషయంలో కాస్త పట్టువిడుపులు చూపుతున్న టిడిపికి సీట్లలో కోతపెట్టి వాటిని టిజేఎస్, సిపిఐ పార్టీలకు పంచి ఇస్తుందేమో?
ఇక పార్టీలో ఒకే స్థానానికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నవారి జాబితాపై నేటి సమావేశంలో చర్చించి, వారిలో గెలుపు గుర్రాలకు సీట్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ స్థానాలపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకొన్నట్లయితే టికెట్ ఆశించి భంగపడినవారు పార్టీపై తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుంది కనుక డిల్లీలో చర్చించి అధిష్టానంతో అభ్యర్ధుల పేర్లు ఖరారు చేయవచ్చు.