తాగుబోతులు చేసిన చిన్న తప్పు చిన్నారి ప్రాణాలను తీసింది. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఈ నెల 1వ తేదీన యువకులు కారు అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న కారుపై పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన పదేళ్ల చిన్నారి రమ్య బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచింది. ఎవరో చేసిన పాపానికి తమ ఇంటిదీపాన్ని బలి తీసుకోవడంతో కుటుంబసభ్యులు సహా బంధువుల ఆవేదన, రోదనలకు అంతు లేకుండా పోయింది. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం డాక్టర్లు రమ్య మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తల్లి రాధిక తన కూతురిని కడసారి చూస్తానని పట్టుబట్టడంతో ఆమెను అంబులెన్స్‌లో కేర్‌కు తీసుకువచ్చారు. కనీసం పక్కకు తిరుగడానికి కూడా వీలులేని పరిస్థితిలోనున్న రాధిక వద్దకు స్ట్రెచర్‌పై చిన్నారి రమ్య మృతదేహాన్ని తీసుకువచ్చారు. ప్రమాదంలో గాయపడిన తన బంగారుతల్లి కళ్లు తెరుస్తుందని.. ఎప్పటిలా తన వద్దకు లేడిపిల్లలా పరిగెత్తుకుని వస్తుందని ఇన్ని రోజులు వేచిచూసిన ఆ కన్నతల్లికి కడుపుకోతే మిగిలింది. స్ట్రెచర్‌పై జీవం లేకుండా ఉన్న కూతురి నుదుటిని ముద్దాడి స్పృహ కోల్పోయింది. ఈ సన్నివేశాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేశాయి.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ చనిపోయిన రమ్య కుటుంబ సభ్యులను ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో మంత్రి తలసాని పరామర్శించారు. రమ్య మృతి చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రమ్య కుటుంబానికి కావాల్సిన సాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామన్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కూడా రమ్య మృతిపై సంతాపాన్ని ప్రకటించారు.