భాగ్యనగరానికి హరితహారం.. అంతా సిద్ధం

హైదరాబాద్ ను హరిత హైదరాబాద్ గా మార్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 25 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకు జి.హెచ్.ఎం.సి, హెచ్.ఎం.డి.ఏ, పోలీస్ విభాగాలతో పాటు పలు శాఖలను కలుపుకొని, కాలనీ వెల్ఫెర్ సంఘాల నుంచి పాఠశాలల విద్యార్థుల వరకు మహా హరితహారంలో భాగస్వామ్యం కానున్నారు.

హరిత హారాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన సీఎం, అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ ఒక్క రోజు 25 లక్షల మొక్కలను నాటేందుకు శ్రీకారం చుట్టారు. మహానగర పురపాలకసంస్థ లక్ష్యాన్ని మించి 35 లక్షల మొక్కలను నాటేందుకు 4,173 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసింది. పలు ప్రాంతాల్లో ఔషధ మొక్కలను కూడా పంపిణీ చేస్తున్నామని జిహెచ్ఎంసీ కమీషనర్ జనార్ధన్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటురంగం నుంచి మొత్తం 104 సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు.

ఇక హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కేసీఆర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగాప్రారంభించారు. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో గవర్నర్ నరసింహన్ మొక్కలు నాటారు. హైటెక్ సిటీలోని టీసీఎస్ బిల్డింగ్, గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ పార్క్‌లో కేటీఆర్ మొక్కలు నాటారు. అనంతరం, ఉప్పల్, జవహర్‌నగర్, మేడ్చల్‌లోని మల్లారెడ్డి విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. నీటిపారుదల శాఖమంత్రి టీ హరీశ్‌రావు బీహెచ్‌ఈఎల్, తెల్లాపూర్, వెలిమల, నందిగామ, పాశమైలారం తదితర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కోసం హెచ్.ఎం.డి.ఏ. ఉద్యానవన శాఖ అధికారులు ఇప్పటికే నర్సరీలలో మొక్కలను సిద్ధంగా ఉంచారు. ఖాళీ ప్రదేశాలలో చెట్లను నాటేందుకు గుంతలను రెడీ చేశారు. వెస్ట్ జోన్ పరిధిలోని నల్లగండ్ల హెచ్.ఎం.డి.ఏ. నర్సరీలో హరితహారానికి దాదాపు 50 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. ఇందులో వేప, రాగి, సంపంగి, దానిమ్మ, సిల్వర్ వోక్స్ తో పాటు పలు రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలు కొలువుదీరాయి.

మరోవైపు నల్లగండ్ల హెచ్.ఎం.డి.ఏ. నర్సరీలో హరితహారానికి 50 లక్షల మొక్కలు సిద్ధం చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. హరితహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు నెలల ముందు నుంచి నర్సరీలలో సీడ్స్ వేసి మొక్కలు పెంచడం జరిగిందని తెలిపారు. హెచ్ఎండిఏ ఏర్పాటు చేసిన నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కొలువు దీరిన నర్సరీ లో రాగి, వేప, మర్రి , పూలు, పండ్లు, ఔషధ మొక్కలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. జిహెచ్ఎంసి తో పాటు ఇతర విభాగాల, కాలనీ సంఘాలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

విద్యుత్ వైర్ల కింద ఏపుగా పెరగని కానుగ, భాఫానియా, షార్ట్ తెరపి మొక్కలు పెంచామని, అదేవిధంగా ఈదురు గాలులకు తట్టుకొని బలంగా ఉండే రాగి, వేప, మర్రి చెట్లను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచామన్నారు. నేడు నాటే మొక్కలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే వృక్షంగా మారాలంటే మొక్కను నాటేటప్పుడు అడుగున్నర లోతు, వెడల్పు గుంతను తీసి అందులో ముందుగా పొడి మట్టిని వేసి మొక్కను పెట్టి సరిపడా ఎరువులు వేసినట్లయితే చీడ పట్టకుండా మొక్క బలంగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి.

పచ్చదనాన్ని పెంపొందిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో కాలనీ సంఘాలు స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. హరితహారంలో భాగంగా కొండాపూర్ ప్రధాన రహదారికి ఇరువైపులా 50 వేల మొక్కలను నాటేందుకు ముందుకు పలు కాలనీలు రెడీ అవుతున్నాయి. అంతేకాకుండా తమ సొంత ఖర్చులతో మొక్కల నిర్వహణ చూస్తామంటున్నారు. స్వచ్చంద సంస్థ నగరంలో 2 లక్షల మొక్కలను పలు కాలనీ వాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సొంతంగా రూపొందించిన యాప్ ద్వారా మొక్కల స్థితిగతులను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మొత్తానికి హరితహారం విజయవంతం కావాలంటే.. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి.