సెల్ఫీల పిచ్చి గురించి అందరికి తెలుసు. తాజాగా తెలంగాణలో సెల్ఫీల ట్రెండ్ సాగుతోంది. అయితే ఈ సెల్ఫీలు అందరికి ఇన్స్ఫిరేషన్ ఆదర్శంగా నిలుస్తున్నాయి. అది కూడా పదిమందికి మంచి చేసే పచ్చటి సెల్ఫీ. అదేంటి పచ్చటి సెల్ఫీ ఏంటి అనుకుంటున్నారా.? సెల్ఫీ విత్ ప్లాంట్. హరితహారంలో భాగంగా బాగా పాపులర్ అవుతున్న సెల్ఫీ విత్ ప్లాంట్ కొత్త పుంతలు తొక్కుతోంది.
సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన హరిత హారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు తమవంతు సహాకారం అందిస్తున్నారు. చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకు ఈ ఆకు పచ్చ తెలంగాణలో భాగస్వామ్యులు అవుతున్నారు. ఇక హరిత హారం కార్యక్రమానికి మరింత ఊపు తెచ్చేందుకు టెక్నాలజీని సైతం వాడుకుంటున్నారు.. ప్రత్యేకంగా యువత కోసం ఓ సరికొత్త సెల్ఫీ యాప్ తయారు చేసి వారిని ఆకర్షిస్తున్నారు.
యువత లో హరితహారంపై ఆసక్తి పెంచేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. యువతను సైతం ఈ బృహత్తర ప్రాజెక్ట్ లో భాగస్వామ్యులు చేసేందుకు కొత్త యాప్ ను క్రియేట్ చేసింది. కార్పోరేషన్ సౌజన్యంతో బుల్లి తెర నటులు రవి, అభిలు సెల్పీ కొట్టు- బహుమతి పట్టు అనే నినాదాంతో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. హాయ్ సెల్ఫీ పేరుతో రూపొందించిన ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుని.. చెట్టు నాటి ఆ మొక్క తో సెల్ఫీ దిగి యాప్ లో అప్ లోడ్ చేసిన వారిలో పదిమందికి బహుమతులు అందుతాయి.
జోష్ లో ఉన్న యువత ..హారిత హారంలోనూ భాగస్వామ్యం అయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మేయర్ నన్నపనేని నరేందర్ తెలిపారు. మంచి మొక్కను నాటి వారి సంరక్షణ బాధ్యతలు తీసుకున్న వారిని ఎంపిక చేసి బహుమతులు అందిస్తామన్నారు.. తెలంగాణను పచ్చగా మార్చాలనే సీఎం కేసీఆర్ కల సాకారం కావాలంటే యువత అంతా హరిత హారంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సెల్ఫీల మోజులో ఉండే యువత..గ్రీన్ సెల్ఫీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఉద్యమంలా సాగుతున్న హారిత విప్లవానికి తమవంతుగా ఊతం అందిస్తున్నారు.