తెలంగాణ ద్రోహులతో చేతులు కలిపినందుకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు చేతులు కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బ తీయాలని చూస్తుంటే వారితో కోదండరామ్ కూడా చేతులు కలపడం చాలా పెద్ద పొరపాటు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే వారితో చేతులు కలిపామని కోదండరామ్ చెప్పడం సిగ్గుచేటు. తెలంగాణ ఇవ్వకుండా జాప్యం చేసి అనేకమంది విద్యార్ధుల ప్రాణాలు బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ ఏర్పాటు చేయవద్దని చివరి నిమిషం వరకు అడ్డుపడినది చంద్రబాబు నాయుడు కాదా? ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం అటువంటివారితో కోదండరామ్ చేతులు కలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆయనను శిక్షించబోతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పడాన్ని మంత్రి హరీష్ రావు తప్పు పట్టారు. ఒకవేళ పొరుగు రాష్ట్రమైన ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే, తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ ఏపీకి తరలిపోతే అప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదు కానీ ఏపీతో పాటు తెలంగాణకు కూడా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.