
తెలంగాణ సిఎం కేసీఆర్, ఆయన మంత్రులు, తెరాస నేతలు ఇంతవరకు తనను ఎన్ని తిట్లు తిట్టినా స్పందించని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, ఇప్పుడు వారికి ఘాటుగా జవాబులు చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని, జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్దపడిన్నప్పటి నుంచే ఆయనలో ఈ మార్పు వచ్చిందని చెప్పవచ్చు.
మొన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మహాకూటమి గెలిస్తే నేను తెలంగాణ ముఖ్యమంత్రి కాను కదా? తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం. దాని మంచి చెడులను అక్కడి పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజలే నిర్ణయించుకొంటారు తప్ప మద్యలో నేనేమీ చేస్తాను? తెలంగాణలో టిడిపిని కాపాడుకోవడం కోసమే మేము కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాము తప్ప మరో ఉద్దేశ్యంతో కాదు,” అని చంద్రబాబునాయుడు నిర్మొహమాటంగా చెప్పారు. సిఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసి వదిలేశారని చురకలు వేశారు.
నిన్న ఒంగోలు జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో అందరికీ తెలుసు. అమెరికాలో కాళ్ళరిగేలా తిరిగి హైదరాబాద్ నగరానికి పెద్దపెద్ద కంపెనీలను రప్పించాను. అవి రావడంతో హైదరాబాద్ నగరం బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతులా మారిందని అందరికీ తెలుసు. వడ్డించిన విస్తరి వంటి హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ చేతిలో పెట్టినప్పటికీ ఆయనకు పాలించుకోవడం చేతకాక నాపై విమర్శలు చేస్తున్నారు. తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికే సిఎం కేసీఆర్ నాపై విమర్శలు చేస్తున్నారు. అయితే నేను తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు కనుక ఎవరు ఎటువంటివారో, ఎవరి వలన రాష్ట్రానికి మేలు కలిగిందో వారే నిర్ణయిస్తారు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.