
రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలందరూ జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే చెప్పదలచుకొన్న విషయాన్ని ప్రజల మనసులలో నాటుకుపోయేలాగ చెప్పడం కొద్దిమందికే తెలుసు. వారిలో మంత్రి కేటిఆర్ ఒక్కరు.
గురువారం కల్వకుర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేటిఆర్ మాట్లాడుతూ, “గత ఏడు దశాబ్ధాల కాంగ్రెస్, టిడిపి పాలనలో పాలమూరు జిల్లా ఏవిధంగా ఉంది. ఈ నాలుగేళ్ల తెరాస పాలనలో జిల్లాలో ఏవిధంగా అభివృద్ధి చెందింది మీరే స్వయంగా బేరీజు వేసుకొని, మేము అభివృద్ధి చేసినట్లే భావిస్తే మాకు ఓట్లు వేయండి. ఈ నాలుగేళ్లలో జిల్లాలో 95,000 ఎకరాలకు నీళ్ళు అందించాము. మళ్ళీ అధికారంలోకి వస్తే మరో లక్షా పదివేల ఎకరాలకు నీళ్ళు పారిస్తాము. ఒకప్పుడు వలసలకు నిలయంగా ఉండే పాలమూరు జిల్లా ఇప్పుడు పచ్చబడుతుంటే కాంగ్రెస్ నేతల కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఇదేవిదంగా అభివృద్ధి జరుగుతుంటే తమను పట్టించుకొనే నాధుడు ఉండదనే భయంతోనే కోర్టులలో కేసులు వేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు, ఈ జిల్లా నుంచి పోటీ చేయబోతున్న కొందరు కాంగ్రెస్ అభ్యర్ధులు పాలమూరు ఎత్తిపోతల పధకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులలో కేసులు వేసి అడ్డుకొనే ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులపై కలిపి కాంగ్రెస్ నేతలు మొత్తం 200 కేసులు వేశారు.
ఒకపక్క కాంగ్రెస్ నేతలు కోర్టులలో కేసులు వేస్తుంటే మరోపక్క ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరుతూ డిల్లీలో సంస్థలకు లేఖలు వ్రాస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, టిడిపిలు రెండూ చేతులు కలిపి మీ ముందుకు రాబోతున్నాయి. మన ప్రాజెక్టులను అడ్డుకొంటున్నవారికి మనమెందుకు ఓట్లు వేయాలి? అటువంటి వారికి ఓట్లేసి గెలిపిస్తే ఏమవుతుంది? రాష్ట్రం మళ్ళీ సాగుత్రాగు నీటికి కటకటలాడే పరిస్థితి దాపురిస్తుంది. కనుక మీకు నీళ్ళు కావాలో కన్నీళ్ళే కావాలో మీరే నిర్ణయించుకోండి,” అని అన్నారు.
సిఎం కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకొంటున్న మహాకూటమి నేతల తీరును మంత్రి కేటిఆర్ తప్పు పట్టారు. “సిఎం కేసీఆర్‌ను గద్దె దించాలని మహాకూటమి నేతలు నోటికి వచ్చినట్లు కారుకూతలు కూస్తున్నారు. అసలు సిఎం కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలి? రైతులకు సాగునీరు, పంటపెట్టుబడి, జీవితభీమా, నాణ్యమైయన్ ఎరువులు, విత్తనాలు అందిస్తునందుకా? ఒంటరి మహిళలకు, వృద్దులు, వికలాంగులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తునందుకా? లేక నిరుపేద ఆడపిల్లల పెళ్ళిలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరిట లక్ష రూపాయలు ఆర్దిక సహాయం అందిస్తునందుకా? ప్రతీ పేద కుటుంబానికి మనిషికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నందుకా లేక పౌషికాహారలోపంతో బాధపడుతున్న విద్యార్ధులకు సన్నబియంతో మంచి భోజనం పెట్టి వారి చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తునందుకా? అని మహాకూటమి నేతలను మీరే నిలదీసి అడగాలి,” అని మంత్రి కేటిఆర్ అన్నారు.
మంత్రి కేటిఆర్ గొంతు నొప్పితో బాధ పడుతున్నప్పటికీ మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో చాలా చక్కగా వివరించి ప్రజలను ఆకట్టుకొన్నారు.