18.jpg)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ తక్షణమే మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో హైకోర్టు ఉద్యోగుల విభజన ప్రక్రియ మొదలైంది. దీని కోసం హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వాటి ప్రకారం నవంబరు 15వ తేదీలోగా ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ తాము ఏపీ, తెలంగాణ హైకోర్టులలో దేనిక్రింద పనిచేయాలనుకొంటున్నారో తెలియజేయవలసి ఉంటుంది. హైకోర్టులో వివిద శాఖాధిపతులు ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను సీల్డ్ కవర్స్ లో భద్రపరిచి వాటిని ఈనెల 15వ తేదీ సాయంత్రంలోగా ప్రధానన్యాయమూర్తికి అందజేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మానవేంద్రనాథ్‌రాయ్ ఆదేశించారు.
హైకోర్టు ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు:
1. ఉద్యోగాల కేటాయింపులో సీనియారిటీకి తొలి ప్రాధాన్యత ఉంటుంది.
2. భార్యాభర్తలు ఇద్దరూ హైకోర్టులోనే ఉద్యోగాలు చేస్తున్నట్లయితే వారు ఎంచుకొన్న హైకోర్టుకే కేటాయించబడతారు.
3. హైకోర్టు ఉద్యోగి భర్త లేదా భార్య రెండు రాష్ట్రాలలో ఎక్కడ పని చేస్తుంటే ఆ రాష్ట్రానికే ఆ ఉద్యోగిని కేటాయించబడతారు.
4. వితంతువులకు మరియు 60 శాతానికి మించి అంగవైకల్యం ఉన్నవారికి వారు కోరుకొన్న హైకోర్టులోనే కేటాయిస్తారు.
5. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు హైదరాబాద్‌లో చికిత్స తీసుకొంటున్నట్లయితే, అందుకు సంబందించిన వైద్య పత్రాలను సమర్పించినట్లయితే వారు హైదరాబాద్‌లోనే కొనసాగే అవకాశం కల్పించబడుతుంది.
6. రెండేళ్ళు అంతకంటే తక్కువ సమయంలో పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగులు ఏపీ, తెలంగాణ హైకోర్టులలో తమకు నచ్చిన చోటికి బదిలీ పొందవచ్చు.
7. ఒకవేళ ఎవరైనా దరఖాస్తులు సమర్పించకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచక్షణ మేరకు వారిని బదిలీ చేస్తారు.
8. ఉద్యోగులు ఎంపిక చేసుకొన్న హైకోర్టులో తగినన్ని ఖాళీలు లేకపోతే వారిని మరో హైకోర్టుకు బదిలీ చేయబడతారు. లేదా పదోన్నతి మీద దిగువకోర్టుకు బదిలీ చేయబడతారు. వారు కోరుకొన్న హైకోర్టులో ఖాళీలు ఏర్పడినప్పుడు మళ్ళీ అక్కడికి బదిలీ చేయబడతారు. ఉద్యోగుల దరఖాస్తులు, ఖాళీల సంఖ్యను బట్టి ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారంతో కేటాయింపులు చేస్తారు.
వచ్చే ఏడాది మార్చి నెలలోగా అమరావతిలో హైకోర్టు భవనాలు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు నిర్మించి ఇస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇవ్వడంతో ఈ విభజన ప్రక్రియ ఊపందుకొంది.