రేవంత్‌రెడ్డికి 4+4+2!

హైకోర్టు ఆదేశాలమేరకు కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి భద్రత పెంచబడింది. ఆయనకు వికారాబాద్‌ రిజర్వ్ ఆర్మడ్ ఫోర్సస్ కు చెందిన భద్రతా సిబ్బందితో 4+4 భద్రత కల్పిస్తున్నట్లు రాష్ట్ర భద్రతా కమిటీ తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇద్దరు గన్ మ్యాన్లకు ఈ 8 మంది అదనమని తెలిపింది. అంటే రేవంత్‌రెడ్డికి ఇకపై మొత్తం 10 మంది గన్ మ్యాన్లు రేయింబవళ్లు కాపలాగా ఉంటారన్న మాట. 

ఆయన సిఎం కేసీఆర్‌, తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు కనుక తెరాస నుంచి తనకు ప్రాణహాని ఉందని, కనుక కేంద్ర రక్షణ సిబ్బందితో భద్రత కల్పించాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం హైకోర్టులో పిటిషను వేశారు. దానిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం రేవంత్‌రెడ్డి కోరినవిధంగా భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అధనపు భద్రతకు అయ్యే ఖర్చు మొత్తం రేవంత్‌రెడ్డి భరించాలని ఆదేశించింది. అందుకు ఆయన అంగీకరించడంతో 4+4 భద్రత కల్పించబడింది. ఈ సందర్భంగా సమావేశమైన భద్రతా కమిటీ ఇటీవల వైజాగ్ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి గురించి కూడా చర్చించి ఆయనతో సహా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల భద్రతా ఏర్పాట్లను సమీక్షించింది.