సీట్ల కేటాయింపుపై ఎల్ రమణ స్పందన

సుమారు నెలన్నరపాటు సీట్ల పంపకాలపై ఎడతెగని చర్చలు జరిపిన తరువాత కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు తాను మొదటి నుంచి ఎన్ని సీట్లు ఇస్తానని చెపుతోందో అంతకు మించి ఒక్క సీటు కూడా ఆధనంగా ఈయలేదు. మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 95 ఉంచుకొని, మిగిలిన 24 సీట్లను మిత్రపక్షాలకు విడిచిపెట్టింది. వాటిలో టిడిపికి 14 సీట్లు లభించడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని సీట్లు లభించాయనేది ముఖ్యం కాదని, ఎన్నికలలో విజయం సాధించడమే ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో గడీల పాలన తీసుకువచ్చిన సిఎం కేసీఆర్‌ను గద్దె దించడమే తమ ఏకైక లక్ష్యమని చెప్పారు.

ఈసారి ఎన్నికలలో కేసీఆర్‌ 110 సీట్లు గెలుచుకొంటానని చెపుతూ తన స్వంత పార్టీ నేతలను, అభ్యర్ధులనే మభ్యపెడుతున్నారని కానీ తెరాస సింగిల్ డిజిట్ కే పరిమితమవడం ఖాయమని చెప్పారు. 50 రోజులలో 100 బహిరంగసభలు నిర్వహిస్తామని చెప్పుకొన్న సిఎం కేసీఆర్‌ ఇంతవరకు కేవలం 4 సభలకే పరిమితం కావడానికి కారణం ప్రజలలో తన పట్ల వ్యతిరేకత పెరిగిందని గ్రహించినందునేనని ఎల్ రమణ అన్నారు. టిడిపికి కేటాయించిన 14 స్థానాలలో సామాజిక న్యాయం ప్రాతిపదికన గెలుపు గుర్రాలను బరిలో దించుతామని చెప్పారు. త్వరలోనే తమ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు.