కాంగ్రెస్‌ అభ్యర్ధుల ప్రకటన వాయిదా

కాంగ్రెస్ పార్టీ ఇవాళ్ళ తమ అభ్యర్ధుల మొదటి జాబితాను విడుదల చేయడానికి ప్రయత్నించింది కానీ వీలుపడలేదు. ఈ నెల 8 లేదా 9వ తేదీలలో మొత్తం అందరు అభ్యర్ధుల పేర్లను ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-చార్జ్ రామచంద్ర కుంతియా మీడియాకు తెలిపారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో ఈరోజు జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 95 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకొందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోయే వాటిలో 57 స్థానాలలో అభ్యర్ధులను ఖరారు చేసినట్లు తెలిపారు. మిగిలిన స్థానాలకు త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. మిగిలిన వాటిలో 14 స్థానాల నుంచి టిడిపి పోటీ చేస్తుందని తెలిపారు. ఇంకా మిగిలిన 10 స్థానాలలో టిజేఎస్, సిపిఐ పార్టీలు పోటీ చేస్తాయని కుంతియా తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ముందుగా చెప్పినట్లు ఈరోజు అభ్యర్ధుల పేర్లను ప్రకటించకుండా సంయమనం పాటించింది గనుక మహాకూటమి విచ్చినం కాకుండా నివారించగలిగింది. తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీలు రెండూ కలిపి 10 స్థానాలకు సర్దుకుపోయేందుకు అంగీకరిస్తే ఇక నాలుగు పార్టీలు కలిసి ముందుకు సాగవచ్చు.