జగన్ కేసు వాయిదా

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనపై వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన హత్యాప్రయత్నంపై ఏపీ పోలీసులు సరిగ్గా విచారణ జరుపలేదంటూ వేసిన పిటిషనుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి ఈ కేసును నవంబరు 6వ తేదీకి వాయిదా వేశారు. 

ఈ కేసు కోసం ఏర్పాటు చేసిన సిట్ పోలీసుల బృందం చాలా లోతుగా దర్యాప్తు జరుపుతోంది. జగన్ పై హత్యా ప్రయత్నం చేసిన శ్రీనివాస్ కాల్ డేటా ఆధారంగా అతను ఏపీలో వివిద జిల్లాలలో ఎవరెవరితో మాట్లాడాడు? అతనికి ఎవరెవరితో పరిచయాలున్నాయి?అతని ఖాతాలలో ఎంత డబ్బు ఉంది? అది ఎక్కడి నుంచి వచ్చింది?అతని వెనుక ఎవరైనా ఉన్నారా లేదా? అని రకరకాల కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు. దానిలో భాగంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో పనిచేస్తున్న శ్రీనివాస్ స్నేహితులను ప్రశ్నించేందుకు సిట్ పోలీసు బృందాలు నిన్న బయలుదేరాయి. 

జగన్, వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించడం, డిల్లీ వెళ్ళి ప్రతిపక్షపార్టీల నేతలకు ఫిర్యాదు చేయడం ద్వారా టిడిపిని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుంటే, ఈ హత్యాయత్నం వెనుక వైకాపా నేతలు ఎవరైనా ఉన్నారా?అని కనుగొనేందుకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుంది. టిడిపి-వైకాపాల మద్య సాగుతున్న ఈ రాజకీయచదరంగంలో ఎవరు నెగ్గుతారో తెలియదు కానీ మధ్యలో హత్యాప్రయత్నం చేసిన శ్రీనివాస్ పరిస్థితి అయోమయంగా మారింది.