
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొట్టమొదటి హోంమంత్రిగా వ్యవహరించిన సర్ధార్ వల్లబ్ బాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఆయన స్మృత్యర్ధం గుజరాత్ లోని నర్మదా జిల్లాలో సర్ధార్ సరోవర్ డ్యామ్ సమీపంలో నిర్మించిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో నిర్మించిన 182 మీటర్ల ఎత్తైన సర్ధార్ వల్లబ్ బాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బుదవారం ఉదయం ఆవిష్కరించారు.
ఈ విగ్రహం సమీపంలోనే ‘వాల్ ఆఫ్ యూనిటీ’ అనే పేరుతో నిర్మించబడిన మరో కట్టడాన్ని కూడా ఈరోజు ఉదయమే ఆవిష్కరించారు. సర్ధార్ వల్లబ్ బాయ్ పటేల్ విగ్రహం గురించి చెప్పుకోవలసిన విశేషాలు చాలానే ఉన్నాయి.
1. ఈ విగ్రహం నిర్మాణ పనులు 2014అక్టోబరు31న ప్రారంభించారు. నాలుగేళ్ళ తరువాత అంటే 2018 అక్టోబరు విగ్రహావిష్కరణ చేశారు.
2. ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు. అంటే 597 అడుగుల ఎత్తు అన్నమాట.
3. ఇప్పటి వరకు చైనాలోని స్ప్రింగ్ టెంపెల్ బుద్దా విగ్రహం (157మీటర్లు) అత్యంత ఎత్తైన విగ్రహంగా ఉండేది. కానీ గుజరాత్ లో నిర్మించిన సర్ధార్ వల్లబ్ బాయ్ పటేల్ విగ్రహం ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలిచింది. ఇది అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం (93 మీటర్లు) కంటే దాదాపు రెట్టింపు ఎత్తు ఉంది.
4. దీని నిర్మాణం కోసం 70,000 టన్నులు సిమెంట్, 24,500 టన్నుల స్టీల్, 1,700 టన్నుల కాంస్యం (బ్రాంజ్) వినియోగించారు.
5. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2389 కోట్లు ఖర్చు చేసింది.
6. దీని నిర్మాణంలో 250 మంది ఇంజనీర్లు, 3400 మంది కార్మికులు పాల్గొన్నారు.
7. ఈ విగ్రహం దృడత్వం కోసం అంతర్భాగమంతా స్టీలు, కాంక్రీట్ మిశ్రమంతో నిర్మించి, దానిపైన 553 టన్నుల కాంస్యపు పలకలతో తుది రూపం కల్పించారు.