ఎన్నికలు రాగానే రాజకీయ నేతలు, ముఖ్యంగా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ప్రజలను ఆకట్టుకోవడానికి చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తెరాస అభ్యర్ధులు కూడా ప్రస్తుతం అదే చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ తెరాస అభ్యర్థి వివేకానంద ఎన్నికల ప్రచారానికి బయలుదేరినప్పుడు, దారిలో ఒక మహిళ తన చిన్నపిల్లాడికి స్నానం చేయిస్తుండగా, వివేకానంద హడావుడిగా ఆమె చేతిలో ఆ పిల్లాడిని తీసుకొని తనే స్నానం చేయించడంతో అందరూ మూసిముసినవ్వులు నవ్వుకొన్నారు.
అదేవిదంగా నిన్న ఒక వ్యక్తి తన ఇంటి బయట రోడ్డుపక్కన స్నానం చేయిస్తుంటే అటుగా వెలుతున్న తెరాస అభ్యర్ధి అతనికి సబ్బు రుద్ది స్నానం చేయించడం చూసి అందరూ నవ్వుకొన్నారు. మరికొందరు బట్టలు ఇస్త్రీ చేస్తే, మరో అభ్యర్ధి తన ఊరిలో చనిపోయిన వ్యక్తి పాడె మోసి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.
ఊర్లలో ఎవరి ఇంట్లో శుభ, అశుభ కార్యక్రమాలు జరుగుతున్నా అభ్యర్ధులు వచ్చి అక్కడ వాలిపోయి హడావుడి చేస్తున్నారు. చివరికి సినిమా ధియేటర్లు, బస్టాండ్ల వద్ద కూడా కాపుకాసి, తమకే ఓటువేయాలని కోరుతున్నారు. వారికి పోటీగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులు కూడా ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి నానాతిప్పలు పడుతున్నారు.
కొందరు అభ్యర్ధులు ప్రజలను ఆకట్టుకోవడానికి స్థానిక కళాకారులతో ఆటపాటలు నిర్వహిస్తూ, తాము కూడా ఆపసోపాలు పడుతూ వారితో ఆడిపడుతూ ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసి అందరూ ముసిముసినవ్వులు నవ్వుకొంటున్నారు. ప్రజలు నవ్వితే నవ్విపొదురుగాక...ఓట్లు పడితే అంతే చాలని అభ్యర్ధులు నానా తిప్పలు పడుతున్నారు.