మోత్కుపల్లిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి

టిడిపి బహిష్కృత నేత, బిఎల్ఎఫ్ ఆలేరు అభ్యర్ధి మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్‌ నేత భిక్షమయ్యా గౌడ్ అనుచరులు దాడి చేశారు. ఆలేరు నియోజకవర్గంలో మల్లాపురంలో మోత్కుపల్లి తన అనుచరులతో కలిసి మంగళవారం ఉదయం ఎన్నికల ప్రచారం చేసుకొంటుండగా, అదే సమయంలో అటువైపు వచ్చిన భిక్షమయ్య గౌడ్ అనుచరులు అకారణంగా మోత్కుపల్లి నర్సింహులుపై దాడి చేశారు. ఆ సమయంలో భిక్షమయ్య గౌడ్ అక్కడే ఉన్నప్పటికీ తన అనుచరులను వారించే ప్రయత్నం చేయకపోవడంతో వారు రెచ్చిపోయారు. అయితే అదృష్టవశాత్తు ఈదాడిలో మోత్కుపల్లికి ఎటువంటి గాయాలు కాలేదు.

తనపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఆయన నడిరోడ్డుపై బైటాయించి భిక్షమయ్య గౌడ్, ఆయన అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేసి వారందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంగతి తెలుసుకొని పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని వారిపై చర్యలు తీసుకొంటామని నచ్చజెప్పడంతో మోత్కుపల్లి నర్సింహులు నిరసన విరమించి మళ్ళీ ఎన్నికల ప్రచారం కొనసాగించారు.