ఎంపీ కవిత హెచ్చరికకు అర్ధం ఏమిటో?

తెరాస ఎంపీ కవిత సోమవారం జగిత్యాలలో జరిగిన టీఆర్‌ఎస్‌ యువజన విభాగం సమావేశంలో మాట్లాడుతూ, “గత నాలుగేళ్ళలో కాంగ్రెస్‌, టిడిపిలకు మేము ట్రైలర్ మాత్రమే చూపించాము. ఇంకా అసలు సినిమా చూపించలేదు. అది చూసి భయపడిపోయిన వాళ్ళు మహాకూటమి పెట్టుకొన్నారు. కానీ త్వరలోనే వాళ్ళకు 3డి సినిమా చూపించబోతున్నాము. మరి అప్పుడేమీ చేస్తారో?” అని అన్నారు. 

ఇది ఎన్నికల సమయం కనుక ఆమె ఏదో యధాలాపంగా ఈ మాటలు అన్నారనుకోలేము. గత నాలుగేళ్ళలో పార్టీ ఫిరాయింపులు, ఓటుకు నోటు కేసులతో కాంగ్రెస్‌, టిడిపిలను తెరాస కట్టడి చేయగలిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల గంట మ్రోగగానే కాంగ్రెస్‌ నేతలపై పాత కేసులు తిరగదోడటం అందరూ చూశారు. వాటినే ఆమె ట్రైలర్ గా అభివర్ణిస్తున్నారనుకొన్నట్లయితే, 3డి సినిమాలో భాగంగా ఓటుకు నోటు కేసును, కాంగ్రెస్‌ నేతలపై పాత కేసులను పరుగులు పెట్టించాలని తెరాస అధిష్టానం భావిస్తోందేమో?తద్వారా ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరుకొన్నప్పుడు, మహాకూటమిలో ముఖ్యనేతలు అందరూ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేట్లు చేయడమో లేక ఏకంగా వారిని జైలుకే పంపించే ఆలోచనలో ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. 

ఇక మహాకూటమి తమ అభ్యర్ధులను ప్రకటించేక, తెరాసలో మిగిలిన 12 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాలని సిఎం కేసీఆర్‌ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కనుక మహాకూటమిలో టికెట్లు లభించని కాంగ్రెస్‌, టిడిపి ముఖ్య నేతలను తెరాసలోకి రప్పించి వారికి ఆ టికెట్లు ఇవ్వడం ద్వారా మహాకూటమిని దెబ్బ తీయాలని తెరాస అధిష్టానం భావిస్తే అదేమీ విచిత్రమైన విషయం కాబోదు. కనుక మహాకూటమికి తెరాస చూపించబోయే 3డి సినిమాలో ఇవే సీన్లు కనిపించే అవకాశం ఉందని భావించవచ్చు. ఒకవేళ ఇంతకంటే గొప్ప సీన్లు ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.