నేను పోటీ చేయడం పక్కా: ఆర్.కృష్ణయ్య

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తాను మళ్ళీ ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నట్లు సోమవారం ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్లు, బీసీ విద్యార్ధుల సమస్యలపై నవంబరు 4న ఒక బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది కనుక ఆ పార్టీ టికెట్ పై ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయబోతున్నట్లు భావించాల్సి ఉంటుంది.

కానీ మహాకూటమిలో ఇంకా ఏ స్థానం ఎవరికి అనే అంశంపై చర్చలు కొనసాగుతుండగానే ఆర్.కృష్ణయ్య తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం విశేషమే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడానికి టికెట్ కేటాయించకపోతే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్దం అవుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఒకటి, రెండు రోజులలో ఎలాగూ మహాకూటమి అభ్యర్ధుల జాబితా ప్రకటించబోతోంది కనుక అప్పుడు దీనిపై స్పష్టత వస్తుంది.