రేవంత్‌రెడ్డిపై 100 కోట్లకు పరువు నష్టం దావా?

ఈవెంట్స్ నౌ సంస్థపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలపై ఆ సంస్థ యాజమాన్యం వెంటనే స్పందించింది. పేటిఎం, బుక్ మై షో వంటి ఈ కామర్స్ సంస్థల వంటిదే ఈవెంట్స్ నౌ అని, అది కేవలం టికెట్ల అమ్మకాలకు మాత్రమే పరిమితం తప్ప ఇంతవరకు ఏనాడూ స్వయంగా మ్యూజికల్ నైట్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించలేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

అమెరికాలో ఉన్నత చదువులు చదివిన రాజ్ పాకాల స్థాపించిన ఈవెంట్స్ నౌ ఇంతవరకు ఎటువంటి మచ్చ లేకుండా పూర్తి చట్టబద్దంగా పనిచేస్తోందని, అనేకవందల మందికి ఉద్యోగాలు కల్పించిందని ఆ సంస్థ పేర్కొంది. గచ్చిబౌలీ స్టేడియంలో జరుగబోయే ‘సెన్సేషన్ ఈవెంట్’ కార్యక్రమానికి, ఈవెంట్స్ నౌ సంస్థకు ఎటువంటి సంబంధమూ లేదని ఈవెంట్స్ నౌ సంస్థ పేర్కొంది.

ఈ కామర్స్ సంస్థలు చేసే వ్యాపారాల పట్ల కనీస అవగాహన కూడా లేని రేవంత్‌రెడ్డి, తెరాసను రాజకీయంగా ఎదుర్కొలేకనే తమ సంస్థ మంత్రి కేటిఆర్‌ బందువు రాజ్ పాకాలకు చెందినదని తెలుసుకొని నోటికి వచ్చినట్లు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పేర్కొంది. కనుక రేవంత్‌రెడ్డి తక్షణం తన ఆరోపణలను ఉపసంహరించుకొని ఈవెంట్స్ నౌ సంస్థకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే ఆయనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని ఆ సంస్థ ప్రకటన ద్వారా హెచ్చరించింది.