3.jpg)
కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ సిబ్బందితో భద్రత కల్పించాలని కోరుతూ వేసిన పిటిషనుపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు, ఈసీ అభ్యర్ధన మేరకు సోమవారానికి వాయిదా వేసింది.
రేవంత్‌రెడ్డి తనకు తన రాజకీయ ప్రత్యర్ధులు, సంఘ విద్రోహశక్తుల నుంచి ప్రాణహాని ఉందని, కనుక కేంద్ర రక్షణ సిబ్బందితో భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషను వేశారు. గతంలో తనకు 3+3 భద్రత ఉండేదని కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిని 2+2కి తగ్గించి వేసిందని రేవంత్‌రెడ్డి తన పిటిషనులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉంది కనుక 4+4 భద్రత కల్పించాలని తాను కేంద్రహోంశాఖను, ఈసీని కోరినా అవి పట్టించుకోలేదని కనుక హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని అన్నారు. ఈ కేసులో ఈసీ తరపున హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు రోజులు గడువు ఇవ్వవలసిందిగా చేసిన అభ్యర్ధనను మన్నించిన న్యాయమూర్తి జస్టిస్ ఏ.వెంకట శేషసాయి ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.