6.jpg)
మంత్రి కేటిఆర్ గురువారం సిరిసిల్లలో 8 నియోజకవర్గాలలో రోడ్ షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ గుర్తు హస్తం. అది మామూలు హస్తం కాదు భస్మాసుర హస్తం. ఆ హస్తం ఎవరి నెత్తిన పెడితే వారు భస్మం అవుతారు. ఈసారి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, సిపిఐ పార్టీలపై పెట్టింది కనుక ఆ మూడు పార్టీలు భస్మం అవడం ఖాయం. తెలంగాణ రాష్ట్రంపై కూడా కాంగ్రెస్ పార్టీ తన భస్మాసుర హస్తాన్ని పెట్టడానికి మహాకూటమి రూపంలో మన ముందుకు వస్తోంది. కనుక తెలంగాణ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండి వాటిని త్రిప్పికొట్టాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గెడ్డం గీసుకోనని శపధం చేసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల తరువాత మరింత గెడ్డం పెంచుకొని హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవలసిందే.
గత 7 దశాబ్ధాలలో తెలంగాణ పరిస్థితి ఏవిధంగా ఉండేదో మీరందరూ చూశారు. గత నాలుగేళ్ళలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. కనుక తెరాస, కాంగ్రెస్ పార్టీల పాలనను మీరే స్వయంగా బేరీజు వేసుకొని ఏ పార్టీ మీ అందరికీ మేలు చేసిందో ఏది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందో చూసి ఓటు వేయమని కోరుతున్నాను. ఈ నాలుగేళ్ళలో మేము ఏమేమి అభివృద్ధి పనులు చేశామో, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామో ధైర్యంగా మీకు వివరించగలుగుతున్నాము. కనుక రేపు కాంగ్రెస్ నేతలు మీ వద్దకు వచ్చి ఓట్లు అడిగినప్పుడు గత 7 దశాబ్ధాలలో తెలంగాణకు ఏమి చేశారని... ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీసి అడగండి. తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి వారికి చెప్పి అటువంటి ఆలోచన మీరేందుకు చేయలేదని ప్రశ్నించండి. కాంగ్రెస్ నేతలను ఇప్పుడు ప్రశ్నించలేకపోతే మళ్ళీ ఎప్పుడూ మీకు ఇటువంటి అవకాశం రాదు. వాళ్ళ మాయమాటలు నమ్మి వారికి అధికారం కట్టబెడితే తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. అప్పుడు రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరుకు బదులు రాష్ట్ర ప్రజల కన్నీరు వరదలై పారుతుంది. కనుక రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న తెరాసకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు.