
తెలంగాణ బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నేటి నుంచి ఆదివారం వరకు వరుసగా మూడు రోజులపాటు బిజెపి జాతీయస్థాయి యువ సమ్మేళనం పేరుతో బహిరంగసభలు జరుగుతాయి. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ పర్యవేక్షణలో జాతీయ కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు తదితర నేతలు ఈ సభలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సభలకు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది బిజెపి యువనేతలు హాజరుకానున్నారు. శనివారం జరుగబోయే బిజెపి ప్రతినిధుల సభకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్, ఆదివారం జరుగబోయే సభలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.
మూడు రోజుల పాటు సాగే ఈ సభలలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కారీ, ఉమా భారతి, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాధ్ తదితరులు పాల్గొనబోతున్నారు. త్వరలో తెలంగాణతో సహా 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక బిజెపి ఈ సభలలో ఎన్నికల శంఖారావం పూరించవచ్చు.