
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై వైజాగ్ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈరోజు ఉదయం జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు విమానాశ్రయం చేరుకొని లాంజ్ లో వేచియుండగా, విమానాశ్రయం క్యాంటీన్ లో వెయిటరుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి జగన్ తో సెల్ఫీ తీసుకొంటానని వచ్చి, హటాత్తుగా తన వద్ద ఉన్న చిన్న చాకుతో జగన్ పై దాడి చేశాడు. కానీ జగన్ చుట్టూ ఉన్న వైకాపా నేతలు అతనిని అడ్డుకోవడంతో జగన్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ దాడిలో జగన్ ఎడమ భుజంపై చిన్న గాయం అయ్యింది. వెంటనే విమానాశ్రయంలో ఉన్న ప్రాధమిక చికిత్సా కేంద్రంలో జగన్ కు కట్టుకట్టారు. అనంతరం జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు.
విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది జగన్ పై దాడిచేసిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతను జగన్ మోహన్ రెడ్డిపై ఎందుకు దాడి చేశాడు? వ్యక్తిగత ద్వేషంతోనా లేక మానసిక సమస్యతో బాధపడుతున్నాడా లేక జగన్ రాజకీయ ప్రత్యర్ధులు కుట్రలో భాగంగా అతను ఈ దుసాహస్సానికి పూనుకొన్నాడా అనేది పోలీసుల విచారణలో తెలియవలసి ఉంది.