రేవంత్‌రెడ్డికి ఎవరు భద్రత కల్పించాలి?

కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తనకు రాజకీయ శత్రువులు, సంఘ విద్రోహశక్తుల నుంచి ప్రాణహాని ఉందని కనుక కేంద్ర రక్షణ సిబ్బందితో లేదా ఏదైనా స్వతంత్ర సంస్థ ద్వారా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషను వేశారు. తనకు భద్రత కల్పించాలని కేంద్ర ఎన్నికల కమీషన్, హోమ్ శాఖకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అవి స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని రేవంత్‌రెడ్డి తన పిటిషనులో పేర్కొన్నారు. 

ఆ పిటిషనుపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో ఏది ఆయనకు భద్రత కల్పించాలో ఈనెల 26లోగా తెలియజేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమీషన్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఈ కేసు తదుపరి విచారణ 26కు వాయిదా వేసింది. 

రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో రాజకీయ శత్రువులున్న మాట వాస్తవమే. కానీ ఆ కారణంగా కేంద్ర రక్షణ సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని కోరడం ద్వారా రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పకనే చెపుతున్నట్లుంది. దానిని ఎవరూ సమర్ధించరు. హర్షించలేరు. ఒక రాష్ట్ర స్థాయి ప్రతిపక్షపార్టీ నాయకుడికి జాతీయస్థాయి భద్రత కల్పించడం మొదలుపెడితే, దేశంలో అన్ని రాష్ట్రాలలో నేతలు తమకూ అటువంటి భద్రత కావాలని డిమాండ్ చేయవచ్చు. అయినా రాష్ట్రంలో పటిష్టమైన పోలీస్, నిఘా వ్యవస్థలు ఉండగా వాటిని కాదని రేవంత్‌రెడ్డికి జాతీయస్థాయి భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు. ఎల్లుండి హైకోర్టులో ఈకేసు విచారించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇదే సమాధానం చెప్పవచ్చు.