
తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను, శాంతిభద్రతల పరిస్థితులను స్వయంగా సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ ఓపి రావత్ నేతృత్వంలో ఒక అధికారుల బృందం తెలంగాణలో పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా ఓపి రావత్ హైదరాబాద్‌లో అన్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీస్ కమీషనర్లు, ఐజీ, డీఐజీలతో సమావేశమయ్యారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కలెక్టర్లు, పోలీస్ అధికారులు అందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా గానీ వ్యవహరించరాదని ఓపి రావత్ చెప్పారు. ఇంకా ఎన్నికలకు నెలరోజులు సమయం ఉండగానే అప్పుడే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీగా నగదు పట్టుబడుతోందని, ఎన్నికలు దగ్గరపడే సమయానికి ధనప్రవాహం ఇంకా పెరిగిపోవచ్చునని, కనుక రాష్ట్రంలో అన్నీ జిల్లాలలో పోలీసులు పూర్తి అప్రమత్తతో ఉండాలని ఓపి రావత్ సూచించారు. సంస్యాత్మక ప్రాంతాలలో కూడా ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకొనే విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఓపి రావత్ పోలీస్ అధికారులకు చేసిన సూచనలను ఎవరూ తప్పు పట్టలేరు. అయితే అధికార, ప్రతిపక్షపార్టీల నేతల ఒత్తిళ్ళను, బెదిరింపులను తట్టుకొంటూ పోలీసులు నిష్పాక్షిపాతంగా పనిచేయడం కత్తిమీద సామువంటిదేనని చెప్పవచ్చు.