తెలంగాణకు కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు డిమాండ్

బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ రాష్ట్రం తన వాదనలు వినిపించింది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 500 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటకలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతుండగా కేవలం ఏపిని నిలువరించడం వల్ల తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని వాదించింది. కృష్ణా నదీ జలాలను నాలుగు రాష్ట్రాలకు సమానంగా పంచాలని, అప్పుడే అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసినట్లవుతుందని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ వాదనలు వినిపించారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలొ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు తెలంగాణ వాదనలు చాలా కీలకంగా మారాయి. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అన్యాయం కన్నా, హైదరాబాద్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నుండి అన్యాయం జరుగుతోందని వైద్యనాధన్ వివరించారు. కృష్ణా నదీ జలాల వాడకంలో నాడు హైదరాబాద్ రాష్ట్రానికి 690 టిఎంసీలు ఉండేదని, కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేటాయింపుల్లో  299 టిఎంసీలకు తగ్గించారని తెలిపారు. కానీ పక్క రాష్ట్రం చేస్తున్న నిర్వాకం వల్ల కృష్ణా జలాల్లో మరింత అన్యాయం జరుగుతోందని అన్నారు. అలా కాకుండా ఎగువ రాష్ట్రాల్లో కూడా నీటి కేటాయింపులను నిలువరించి.. అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలని వాదించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉండాలని అన్నారు. నీటి వినియోగానికి ఆపరేషన్ ప్రోటోకాల్ కావాలని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ను వైద్యనాధన్ తెలంగాణ రాష్ట్రం తరఫున డిమాండ్ చేశారు.